ఎస్‌బీఐలో ఏయే లోన్స్ తీసుకుంటే.. ఎంత వ‌డ్డీ వేస్తారో తెలుసా..?

-

మన దేశంలో ఉన్న అతి పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ మొద‌టి స్థానంలో ఉన్న విష‌యం విదితమే. ఈ బ్యాంకు అందించే స‌ర్వీసులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల లోన్లు ఎస్‌బీఐలో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏ లోన్‌కు ఎంత వ‌డ్డీ ఉంటుందో, ఇత‌ర సేవ‌లు ఏం పొంద‌వ‌చ్చో, ఏయే లోన్లు మ‌నకు అనువుగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ప‌ర్స‌న‌ల్ లోన్

ఎస్‌బీఐలో ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటే ఏడాదికి 12.5 నుంచి 15.5 శాతం మధ్య వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన డిఫెన్స్, పారామిల‌ట‌రీ, ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ఉద్యోగులు ఎస్‌బీఐ నుంచి పర్స‌న‌ల్ లోన్ తీసుకుంటే వారికి 12 నుంచి 13 శాతం మ‌ధ్య వ‌డ్డీ వేస్తారు. అయితే ప‌ర్సన‌ల్ లోన్ మ‌న‌కు గ‌రిష్టంగా రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఎస్‌బీఐలో ల‌భిస్తుంది. 5 సంవ‌త్స‌రాల్లోగా రీపేమెంట్ చేయాలి.

2. ఆటో లోన్

వాహ‌నాలను కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐలో ఆటో లోన్ తీసుకుంటే ఏడాదికి 9.25 నుంచి 10.75 మ‌ధ్య వ‌డ్డీ చెల్లించాలి. 5 సంవత్స‌రాల కాల‌వ్య‌వ‌ధి లోన్‌కు ఉంటుంది. ఆ లోగా లోన్‌ను మొత్తం చెల్లించాలి. ఇక ఇటీవ‌లే ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ స్కీంను ప్ర‌క‌టించింది. అందులో లోన్ తీసుకుంటే వ‌డ్డీ 20 బేసిస్ పాయింట్లు త‌గ్గుతుంది. అలాగే రీపేమెంట్ గ‌డువు 8 ఏళ్లు ల‌భిస్తుంది. ఈ స్కీంలో లోన్ తీసుకుంటే మొద‌టి ఆరు నెల‌ల్లో ప్రాసెసింగ్‌ ఫీజు కూడా చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఎల‌క్ట్రిక్ కార్ల‌ను కొంటేనే ఈ స్కీం వ‌ర్తిస్తుంది.

3. హోం లోన్

ఎస్‌బీఐలో హోం లోన్ తీసుకుంటే 8.65 నుంచి 9.30 శాతం మ‌ధ్య వ‌డ్డీ వ‌సూలు చేస్తారు. మ‌హిళ‌ల‌కు అయితే 8.60 నుంచి 9.20 శాతం మ‌ధ్య వ‌డ్డీ వేస్తారు.

4. గోల్డ్ లోన్

ఎస్‌బీఐ లో బంగారాన్ని తాక‌ట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటే రూ.20 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల మ‌ధ్య మ‌నం పెట్టే బంగారం తాక‌ట్టును బ‌ట్టి లోన్ ల‌భిస్తుంది. ఇక ఏడాది ఎంసీఎల్ఆర్‌పై 2 శాతం వ‌డ్డీ అద‌నంగా చెల్లించాలి. 30 నెల‌లు రీపేమెంట్ వ్య‌వ‌ధి ఉంటుంది.

5. ఎడ్యుకేష‌న్ లోన్

విదేశాల్లో ఉన్న‌త చ‌దువులు చదువుకోవాల‌నుకునే పేద విద్యార్థుల‌కు ఎస్‌బీఐ ఎడ్యుకేషన్ లోన్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ఎడ్యుకేష‌న్ లోన్ తీసుకుంటే ఏడాదికి 8.70 నుంచి 10.75 శాతం మ‌ధ్య వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అమ్మాయికైతే వ‌డ్డీపై 0.50 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ల‌భిస్తుంది.

6. ప్రాప‌ర్టీ లోన్

మ‌న‌కున్న ప్రాప‌ర్టీల‌ను తాక‌ట్టు పెట్టి ఎస్‌బీఐలో ప్రాప‌ర్టీ లోన్ తీసుకోవ‌చ్చు. అయితే ఏడాది ఎంసీఎల్ఆర్‌పై 1.45 నుంచి 3 శాతం అద‌నంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version