దేశవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లలో నగదుకు తీవ్రమైన కొరత ఏర్పడుతున్న విషయం విదితమే. దీంతోపాటు దేశంలోని చాలా బ్యాంకులు ఏటీఎంలను నిర్వహించలేక వాటిని మూసివేస్తున్నాయి.
సురేష్ ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. తనకు నెలకు వచ్చే రూ.12వేల జీతం మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసి ఇంటి ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తుంటాడు. అయితే డబ్బు మొతాన్ని విత్‌డ్రా చేసుకుందామని ఎప్పుడు వెళ్లినా ఏటీఎంలలో నగదు దొరకడం లేదు. దీంతో అతనికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి అద్దె మొదలుకొని చిన్న చిన్న ఖర్చులకయ్యే నగదు మొత్తాన్ని క్యాష్ రూపంలోనే ఇవ్వాల్సి వస్తోంది. దీంతో సురేష్ డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కావడం లేదు.
మరోవైపు ఏటీఎంలలో నగదు కొరత సమస్య వేధిస్తోంది. కొన్ని ఏటీఎంలైతే పనిచేయడం లేదు. ఈ క్రమంలో బ్యాంక్‌కు వెళ్లి నగదు పొందడం తప్ప సురేష్‌కు వేరే మార్గం కనిపించడం లేదు. కానీ బ్యాంక్‌కు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలి…! ఇదీ.. ప్రస్తుతం సగటు పౌరుడు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇకపై ఎవరైనా నగదును ఎప్పుడు కావాలంటే అప్పుడు తమకు సమీపంలో ఉండే కిరాణా షాపులోనే తీసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. త్వరలో ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది.
దేశవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లలో నగదుకు తీవ్రమైన కొరత ఏర్పడుతున్న విషయం విదితమే. దీంతోపాటు దేశంలోని చాలా బ్యాంకులు ఏటీఎంలను నిర్వహించలేక వాటిని మూసివేస్తున్నాయి. దీంతో జనాలకు నగదుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్‌బీఐ త్వరలో క్యాష్ ఇన్, క్యాష్ అవుట్ పేరిట ఓ నూతన విధానాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలో కిరాణా షాపుల వారికి పీవోఎస్ యంత్రాలను ఇస్తారు. దీంతో వినియోగదారులు కిరాణా షాపుల్లోకి వెళ్లి తమ ఏటీఎం, డెబిట్ కార్డు లేదా ఆధార్ కార్డులతో పీవోఎస్ యంత్రాలను స్వైప్ చేసి తమకు కావల్సినంత నగదు పొందవచ్చు. త్వరలోనే ఈ నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో ప్రజల నగదు కష్టాలు తీరనున్నాయి.
అయితే ఆర్‌బీఐ ఈ నూతన విధానాన్ని అమలు చేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఈ విధానం అమలు చేయాలంటే పెద్ద ఎత్తున పీవోఎస్ యంత్రాలు కావాలి. వాటి తయారీకి సమయం పడుతుంది కనుక.. మరో 6 నెలల్లోగా ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఇలా గనక జరిగితే చాలా మందికి నగదు కష్టాలు తీరుతాయి..!