కార్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా ? ఈ 5 విష‌యాల‌ను ఒక్క‌సారి తెలుసుకోండి..!

-

నేటి ఆధునిక‌ ప్రపంచంలో కారును సొంతం చేసుకోవడం అనేది విలాసవంతమైనదిగా కాక‌ అవసరంగా మారింది. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల కోసం కంపెనీలు మార్కెట్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త కార్ల‌ను విడుద‌ల చేస్తున్నాయి. అయితే కార్ కొనేందుకు చాలా మంది లోన్‌ల‌ను తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలో కార్ లోన్ కోసం అప్లై చేసే వారు కింద తెలిపిన 5 విష‌యాల‌ను ఒక్క‌సారి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే…

taking car loan then you must know these 5 things

* ఆర్థిక సంస్థ‌లు లేదా బ్యాంకులు మీకు రుణాల‌ను అందించేందుకు క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. అందువ‌ల్ల క్రెడిట్ స్కోరు క‌నీసం 700కు పైగా అయినా ఉంటే మంచిది. కొన్ని సంస్థ‌లు 750 ఆపైన క్రెడిట్ స్కోరు ఉంటే త‌ప్ప రుణాల‌ను ఇవ్వ‌వు. క‌నుక కార్ లోన్ కోసం అప్లై చేసే వారు ఈ స్కోరు ఎంత ఉందో ముందే చెక్ చేసుకుంటే మంచిది. అయితే మీకు వ‌చ్చే ఆదాయం బాగా ఎక్కువ‌గా ఉంటే ఈ క్రెడిట్ స్కోరును కొన్ని ఆర్థిక సంస్థ‌లు, బ్యాంకులు పెద్ద‌గా ప‌ట్టించుకోవు. కాబ‌ట్టి ఆదాయం ప‌రంగానైనా ఉత్త‌మ స్థానంలో ఉండాలి. దీంతో కార్ లోన్ సుల‌భంగా ల‌భిస్తుంది.

* మీకు ఇప్ప‌టికే ఈఎంఐలు ఉంటే మీకు నెల నెలా వ‌చ్చే ఆదాయంలో ఆ ఈఎంఐల మొత్తం క‌లిపితే 40 శాతం మించ‌కుండా ఉండాలి. అందులోనే కార్ ఈఎంఐ కూడా వ‌చ్చేలా చూసుకోవాలి. దీంతో ఈఎంఐలు క‌ట్టేందుకు భారం ప‌డ‌కుండా ఉంటుంది. ఇక త‌క్కువ ఈఎంఐ అయితే ఎక్కువ సంవ‌త్స‌రాలు లోన్ క‌ట్టాలి క‌నుక వ‌డ్డీ ఎక్కువ‌గా ప‌డుతుంది. అదే నెల నెలా ఎక్కువ ఈఎంఐ క‌డతాం అనుకుంటే ఎక్కువ ఆదాయం ఉండేలా చూసుకోవాలి. దీంతో ఈఎంఐలు క‌ట్టేందుకు ఇబ్బందులు రావు.

* సాధార‌ణంగా కార్ల‌కు రుణాలు ఇచ్చే సంస్థ‌లు ప్రాసెసింగ్ ఫీజు కింద క‌నీసం రూ.10వేల వ‌ర‌కు అయినా వ‌సూలు చేస్తాయి. అయితే పండుగలు, ప‌లు ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఈ మొత్తాన్ని మాఫీ చేస్తుంటారు. క‌నుక ఆఫ‌ర్లు ఉన్న‌ప్పుడు కార్ లోన్ల‌ను తీసుకుంటే ఈ చార్జిల‌ను క‌ట్టాల్సిన ప‌ని ఉండ‌దు. అయితే ఇవి లేక‌పోయినా కొన్ని సంస్థ‌లు ఇత‌ర చార్జిల‌ను వ‌సూలు చేస్తాయి. క‌నుక వాటి గురించి కూడా ముందుగానే తెలుసుకుంటే మంచిది.

* కార్ కోసం తీసుకున్న రుణాన్ని ముందుగానే చెల్లిస్తే కొన్ని సంస్థ‌లు మిగిలి ఉన్న అసలుపై 6 శాతం వ‌ర‌కు చార్జిల‌ను వ‌సూలు చేస్తాయి. వీటినే ప్రి పేమెంట్ చార్జిలు అంటారు. అయితే ఈ చార్జిల గురించి కూడా ముందుగానే తెలుసుకుంటే మంచిది.

* ఇక కార్ లోన్‌ను స‌హ‌జంగానే ఎవ‌రైనా 5 ఏళ్ల కాల ప‌రిమితితో తీసుకుంటారు. కానీ కొన్ని సంస్థ‌లు 7 ఏళ్ల వ‌ర‌కు ఈ స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆ సంస్థ‌ల్లో లోన్ తీసుకోడం ద్వారా గ‌రిష్ట కాల‌ప‌రిమితితో కార్ లోన్ పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news