పార్టీ మార్పు వార్తల పై ఫైరవుతున్న ఫైర్ బ్రాండ్…!

-

ఆమె పొలిటికల్ ఫైర్ బ్రాండ్. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఓ ఆట ఆడేసుకున్నారు. ఇప్పుడా నాయకురాలికి కొత్త చిక్కులు వచ్చాయి. అలాంటి ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని చిర్రుబుర్రులాడుతున్నారు. అయితే ఇంట గెలిచి ధైర్యంగా రాజకీయాలు నడుపుతున్న ఈ మాజీ ఎమ్మెల్యేకు రచ్చగెలవడం కష్టంగానే ఉందట. ఇందుకు కారణం పొలిటికల్ సర్కిల్స్‌లో.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలేనని ఆమె సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు.

వంగలపూడి అనిత. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె 2014కి ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తొలి ప్రయత్నంలోనే అధికారపార్టీ ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలోనూ.. పబ్లిక్ డయాస్ మీద వైసీపీ అంటే మండిపడేవారు. ఆ రోజుల్లో అనిత వర్సెస్‌ రోజా ఎపిసోడ్‌ చూసిన వాళ్లకు వీరిద్దరి మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఉందా అన్న ఫీలింగ్‌ కలిగేది. విశాఖ జిల్లాలో నాడు మంత్రులుగా ఉన్న అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్‌ విభేదించుకున్నా.. తనపై ఫలానా వర్గం అని ముద్రపడకుండా జాగ్రత్త పడ్డారు. ఒకటే వర్గం ఉండాలి.. అది అనిత వర్గం అయి ఉండాలన్న స్థాయికి వెళ్లింది అప్పట్లో ఆమె వ్యవహారం.

సీనియర్ల ఎత్తుగడలను గమనించకపోవడంతో 2019 ఎన్నికల నాటికి అనితకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పాయకరావుపేటలో డాక్టర్‌ బంగారయ్యకు టికెట్‌ ఇచ్చిన టీడీపీ. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి అనితను బరిలో దింపింది. వైసీపీ ప్రభంజనానికి కొట్టుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యేల జాబితాలో చేరిపోయారామె. ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో అనితను వ్యతిరేకించిన వారు టీడీపీ ఓటమి తర్వాత రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ బయటకు వెళ్లిపోయారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారయ్య సైతం వైసీపీలో చేరిపోయారు. టీడీపీ అధిష్ఠానం మళ్లీ అనితకే పాయకరావుపేట బాధ్యతలు అప్పగించింది.

విశాఖ జిల్లాకే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అదిగో ముహూర్తం.. ఇదిగో ఈక్వేషన్స్‌ అన్నట్లు ఉంది. ఇలా గంటా పేరు తెరమీదకు వచ్చిన ప్రతిసారీ అనితకు తలనొప్పులు తప్పడం లేదట. గంటాతోపాటు మీరు కూడా పార్టీ మారిపోతున్నారట కదా? నిజమేనా అని తెగ విసిగిస్తున్నారట. ఇక సోషల్‌ మీడియాలో ప్రచారాలైతే దుమ్ము లేచిపోతున్నాయి. దీంతో ఎవరైనా గంటాతో కలిసి మీరూ పార్టీ మారిపోతున్నారట కదా అని అంటే చాలు చిర్రుబుర్రులాడుతున్నారట మేడం అనిత. ఇదేం తలనొప్పిరా నాయనా.. నన్నెందుకు వెంటాడుతున్నారని వాపోతున్నారట.

అనితను టీడీపీలోకి వచ్చేలా ప్రోత్సహించింది మాజీ మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. మొన్నటి ఎన్నికల నాటికి ఆమె గంటా వర్గంతో ఉన్నారనే ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి గంటా కదలికలు ఎటు మళ్లితే అనిత అటు ఉంటారని ఫిక్స్‌ అయ్యారు టీడీపీ అభిమానులు. ఈ ప్రచారమే ఇప్పుడు ఆమెకు తలనొప్పి తెచ్చిపెడుతోందట. అసలు గంటాతో కలిసి టీడీపీలోకి వచ్చిన వారు ఆయనకంటే ముందుగానే పార్టీ వీడి వెళ్లిపోయారు. నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది గంటా కాదు కదా..! అలాంటప్పుడు ఆయన ఎటు వెళ్తే నేను అటు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని మదన పడుతున్నారట అనిత. మొత్తానికి అత్తకొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు ఎక్కువ బాధపడటం అంటే ఇదేనేమో.

 

 

Read more RELATED
Recommended to you

Latest news