సాధరణంగా డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుని నిరంతరం ఎదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే డబ్బు మనిషి జీవితంలో డబ్బు పాత్ర అంత ఉంటుంది. అవును ఇది నిజం, డబ్బు లేనిదే ఏ పనీ జరగదు. డబ్బు ఎంత అవసరమో మనకు గతేడాది లాక్ డౌన్ చాటి చెప్పింది. డబ్బులు లేని పరిస్థితుల్లో పొదుపు చేసిన మొత్తం ఎంతగానో ఉపయోగపడింది. మరి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేంత డబ్బు సంపాదించాలంటే? మనకు వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోక చివరికి ప్రతి నెలా ఏదో ఒక అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం. దీనివల్ల రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. అందువల్ల, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు. భవిష్యత్ అవసరాల కోసం తెలివైన పెట్టుబడులు పెట్టాలి. అంతేకాక, మీ ఆర్థిక లక్ష్యాలను భవిష్యత్ ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి ఏర్పర్చుకోవాలి.
ఉదాహరణకు సీఏ చదవడానికి ప్రస్తుతం రూ .15 లక్షలు ఖర్చవుతుందని అనుకుందాం. రాబోయే 20 ఏళ్లలో 10 శాతం ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఊహిస్తే, అప్పడు ఇదే సీఏ చదవడానికి రూ .1 కోటికి పైగా ఖర్చవుతుంది. అందుకే, భవిష్యత్తును అంచనా వేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. రోజులు పెరుగుతున్న కొద్దీ రూపాయి విలువ తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోవాలి.
ద్రవ్యోల్బణం రేటు 5 % – 6 % మేర ఉంటుందనే అంచనాతో మీ భవిష్యత్ లక్ష్యాలను రూపొందించుకోండి. ఎందుకంటే 5% లేదా 6% ద్రవ్యోల్బణ రేటును సగటు రేటుగా పరిగణలోకి తీసుకోవచ్చు. దీంతో మీ పిల్లల విద్య ఇతర ఖర్చులను అంచనా వేసుకొని, పెట్టుబడి పెట్టండి. ప్రణాళికలతో ముందుకు వెళ్తుండాలి. దీని కోసం సొంతంగా మార్కెట్ పరిస్థితులపై అంచనా చేయాలి. ఉదాహరణకు మీరు కోటి సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకోండి. దాని కోసం రెండు పెట్టుబడి మార్గాలను అనుసరించండి
మొదటిది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్, రెండోది, మంత్లీ సిప్ (సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్). ఈ రెండు విధానాల్లో దేని ద్వారా మీరు త్వరగా మీ టార్గెట్‌ను చేరుకుంటారో జాగ్రత్తగా లెక్కవేసుకోండి. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. అంత త్వరగా రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.5,000 మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ పథకంలో పెట్టుబడి పెడితే, 12 శాతం రాబడి వస్తుందననుకుంటే, వచ్చే 25 సంవత్సరాలలో మీరు కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.