వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? కేరళలో ప్రవేశ పెట్టిన వర్క్ ఫ్రమ్ హోటల్ గురించి తెలుసుకోండి.

కోవిడ్ 19కారణంగా ఇంటి నుండే పనిచేయడం అలవాటైపోయింది. దాదాపు సంవత్సర కాలంగా దీనికి అలవాటు పడ్డారు. ఐతే ఈ పద్దతి అందరికీ ఒకేలా లేదు. కొంతమంది దీని కారణంగా చాలా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి చేసి బోరింగ్ గా అనిపించిన వాళ్ళకోసం ఐఆర్సీటీసి సరికొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది. కేరళకి వచ్చే టూరిస్టుల కోసం వర్క్ ఫ్రమ్ హోటల్ అనే కాన్సెప్టుని తీసుకువచ్చింది. దీని ప్రకారం అందమైన హోటల్ గదిలో, చక్కనైన వాతావరణంలో హోటల్ నుండి పనిచేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది.

ఇది కేవలం కేరళలో మాత్రమే అన్నది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక్క వ్యక్తికి ఐదు రోజులకి పదివేల నుండి మొదలవుతుంది. పూర్తిగా శుభ్రం చేసిన గదులు, మూడుపూటలా భోజనం, టీ, కాఫీ అదనం, వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. పార్కింగ్ కోసం స్థలం ఇంకా ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. కేరళలోని మున్నార్, టెక్కడీ, కుమరకొం, మరారి, కోవలం, వయనాడ్, కొచ్చిన్ ప్రాంతాల్లోని లిస్ట్ చేసిన హోటళ్ళలో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది.

దీనిప్రకారం కనీసం ఐదురోజుల బస ఉంటుంది. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. కోవిడ్ నియంత్రణ నియమాలని పూర్తిగా పాటిస్తూ ఉన్న ఈ హోటళ్ళని బుక్ చేసుకోవడానికి ఐఆర్ సీటీసీ వెబ్ సైటుకి వెళ్ళవచ్చు. లేదంటే ఐఆర్ సీటీసీ మొబైల్ యాప్ ని వాడవచ్చు. కరోనా ఉన్నందున ఇక్కడకి వచ్చిన తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలు చూడడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించగలరు. ఇంట్లోనే పనిచేసి చేసి ఇబ్బంది పడుతుంటే ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలని అనుకుని, అక్కడ కూడా పనిచేసుకోవాలనుకుంటే ఐఆర్ సీటీసీ ప్రవేశ పెట్టిన ఈ విధానాన్ని ఉపయోగించుకోండి.