పర్యాటకులను ఆకర్షించడానికి మాల్దీవ్స్ తీసుకొచ్చిన సరికొత్త ప్రోగ్రామ్.. ఐయామ్ వ్యాక్సినేటెడ్.. వివరాలివే..

భారతదేశ సినిమా సెలెబ్రిటీలు తరచుగా వెళ్ళే పర్యాటక ప్రాంతం గురించి చర్చ వస్తే అందులో మాల్దీవ్స్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయంలోనూ మన సెలెబ్రిటీలు మాల్దీవ్స్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆఫ్ కోర్స్, మాల్దీవ్స్ పర్యాటక శాఖే, సెలెబ్రిటీలని పిలిచి ప్రచారం కల్పించని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. భారతదేశం నుండి వచ్చే పర్యాటకులను మాల్దీవ్స్ కి రానివ్వట్లేదు. అదలా ఉంటే, తాజాగా మాల్దీవ్స్ పర్యాటక శాఖ సరికొత్త ప్రణాళికతో వచ్చింది.

ఐయామ్ వ్యాక్సినేటెడ్ అనే పేరుతో క్యాంపెయిన్ రన్ చేస్తుంది. దీని ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్నవారు మాత్రమే మాల్దీవ్స్ కి రావాల్సి ఉంది. అదీగాక మాల్దీవ్స్ కి వచ్చేవారికి వ్యాక్సిన్ వేయిస్తుంది కూడా. ఈ మేరకు 3వి అనే ప్రోగ్రామ్ ని రన్ చేయాలని చూస్తుంది. దీని ప్రకారం విజిట్, వ్యాక్సినేట్, వెకేషన్ అన్న నినాదంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రపంచంలో సురక్షిత పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచేందుకు మాల్దీవ్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది.

ముందుగా దేశమంతా వ్యాక్సిన్ అందించిన తర్వాత అక్కడికి వచ్చే పర్యాటకులందరికీ వ్యాక్సిన్ వేయాలని భావిస్తుంది. ఇప్పటివరకు మాల్దీవ్స్ లో ఉన్న 65శాతం మందికి వ్యాక్సిన్ వేయబడింది. తొందర్లోనే మొత్తం మందికి వ్యాక్సిన్ వేయించేసి పర్యాటకులకు రక్షణ కల్పించడంలో ముందుండనుంది. ఐతే ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో, వారందరూ ఐయామ్ వ్యాక్సినేటెడ్ అన్న బ్యాడ్జ్ ధరించాల్సి ఉంటుంది. దానివల్ల పర్యాటకులకు భరోసా కల్పించనున్నారు. ప్రస్తుతానికి మాల్దీవ్స్ కి వెళ్ళాలనుకునే ప్రయాణీకులకి ప్రయాణానికి మూడురోజుల ముందు ఆర్ టీ పీసీఆర్ ద్వారా నెగెటివ్ రిపోర్ట్ ఉండాలి. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదు.