యూకేలో సెటిల్ అవ్వాలనుకునే ఇతర దేశాలకు చెందిన ధనిలకు గోల్డెన్ వీసా ఇస్తారు. అయితే అందుకు గాను ముందుగా వారు ఆ దేశంలో 20 లక్షల పౌండ్లను ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి.
భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ 2018లో లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. దేశంలోని పలు బ్యాంకులకు ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు శఠగోపం పెట్టి దేశం వదిలి వెళ్లిపోయాడు. కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కే రూ.13వేల కోట్లు ఎగ్గొట్టాడు. అయితే అలా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన నీరవ్ మళ్లీ ఇటీవలే లండన్‌లో కనిపించి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే నీరవ్ అసలు యూకేలో ఎలా ఉంటున్నాడు ? అతనికి ఏ వీసా లభించింది ? అని ఆరా తీయగా, అతను గోల్డెన్ వీసాపై అక్కడ నివాసం ఉంటున్నట్లు తెలిసింది. మరి.. అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటో, దాన్ని ఎవరికి, ఎందుకు ఇస్తారో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
యూకేలో సెటిల్ అవ్వాలనుకునే ఇతర దేశాలకు చెందిన ధనికులకు గోల్డెన్ వీసా ఇస్తారు. అయితే అందుకు గాను ముందుగా వారు ఆ దేశంలో 20 లక్షల పౌండ్లను ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. దీంతో అలా పెట్టుబడి పెట్టినప్పటి నుంచి 5 ఏళ్ల తరువాత వారికి యూకేలో గోల్డెన్ వీసా వస్తుంది. దీంతో వారు యూకే పౌరులు అయిపోతారన్నమాట. అలా గోల్డోన్ వీసా పొందితే ఇక వారు అక్కడే సెటిల్ కావచ్చు. ఆ దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే 5 ఏళ్ల వరకు ఆగలేమనుకునే వారు 50 లక్షల పౌండ్లను వ్యాపారంలో పెడితే.. 3 ఏళ్లలోనే గోల్డెన్ వీసా ఇస్తారు. అలాగే 1 కోటి పౌండ్లను వ్యాపారంలో పెడితే కేవలం 2 సంవత్సరాల్లోనే గోల్డెన్ వీసా ఇస్తారు. అలా చాలా తక్కువ వ్యవధిలోనే కోటీశ్వరులెవరైనా యూకే గోల్డెన్ వీసా పొంది అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. యూకేలో ఇతర దేశాల వారు ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు, ఆ దేశ ఆర్థిక స్థితిని బలపరిచేందుకు ఈ గోల్డెన్ వీసా రూల్‌ను 2008లో తెచ్చారు. దీంతో చాలా మంది అక్కడ పెట్టుబడులు పెట్టి గోల్డెన్ వీసా పొంది అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగానే గతంలో విజయ్ మాల్యా లండన్‌లో సెటిల్ అయ్యాడు. ఇప్పుడు అతని బాటలోనే నీరవ్ మోడీ లండన్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మరి మాల్యాను భారత్‌కు రప్పించడానికే సతమతం అయిన మన దేశ అధికారులు ఇక నీరవ్‌ను మన దేశానికి తీసుకువచ్చేందుకు ఎన్ని తంటాలు పడతారో వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా.. ఈ గోల్డోన్ వీసా వల్ల ఆర్థిక నేరస్థులు పెరిగిపోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ కామెంట్‌ను మాకు తెలియజేయండి..!