కరోనా మహమ్మారి కారణంగా అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల దేశంలోని అనేక మందికి మానసిక సమస్యలు వస్తున్నాయని సర్వేలో తేలింది. 61 శాతం మంది భారతీయులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సమస్యలతోపాటు.. ముందు ముందు ఎలాంటి తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందేమోనన్న భయంతో.. అనేక మంది తీవ్రమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారట. ఈమేరకు ది మావెరిక్స్ ఇండియా, జెన్-జడ్ అనే సంస్థలు చేసిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయాలు తెలిశాయి.
దేశంలో ఉన్న అనేక మంది.. లాక్డౌన్ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చాలా సమయం పడుతుందని సర్వేలో చెప్పగా.. కరోనాకు కారణమైన చైనాలో ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాల కన్నా దారుణంగా పడిపోతుందని.. మరికొందరు చెప్పారు. ఇక వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, గృహిణుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో, రాదోనన్న భయం కొందరిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. అందుకనే దేశంలో మానసిక రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రస్తుతం బాగా పెరుగుతోంది.
అయితే దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తేశాక పరిస్థితిలో మార్పు రావచ్చని నిపుణులు అంటున్నారు. లాక్డౌన్ అనంతరం పూర్తి స్థాయిలో అన్ని కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రజల వైఖరిలో కొంత వరకు మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందని.. దీంతో వారిలో మానసిక సమస్యలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని.. వారు అంటున్నారు.