ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి గత ఏడాది ఎన్నికల్లో ప్రజల నుంచి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎక్కడ కూడా చంద్రబాబు అనుకున్న విధంగా నాయకులు పట్టు సాధించలేక పోయారు. అంతే కాదు.. గెలుపు గుర్రాలు ఎక్కడం ఖాయమని అనుకున్న నాయకులూ చతికిల పడ్డారు. అలా.. సాగిన గత ఏడాది ఎన్నికల ప్రస్థానం.. ఈ ఏడాది వచ్చే సరికి పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పార్టీలో నాయకులు ఎవరు ఎప్పుడు జంప్ చేస్తారు ? ఎవరు ఎటు నుంచి సైకిల్ దిగేస్తారు ? అనే చర్చే ఎక్కువగా సాగుతోంది. అది కూడా చంద్రబాబు కీలకమైన కార్యక్రమాలు చేపట్టిన సమయంలోనే జరుగుతుండడం మరింతగా చర్చకు దారితీస్తోంది.
ఇప్పటి వరకు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన (అంటే.. అధికారికంగా పార్టీ కండువా కప్పుకోక పోయి నా..) నాయకుల ప్రొఫైల్ చూస్తే.. ఎవరూ తక్కువ స్థాయి నేతలు కారు. పైగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నవారే. అంతేకాదు.. వారు నమ్ముకున్న పార్టీ కోసం ఎంతకైనా ముందుకు వెళ్లిన వారే. ప్రజలకు ఆపద్భాంధవులుగా పేరు తెచ్చుకున్న నాయకులే. అంతేకాదు.. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా కావడం విశేషం. అలాంటి నాయకులు చంద్రబాబుకు సైలెంట్‌గా హ్యాండిచ్చారు. ఆయనకు రాంరాం చెప్పి పార్టీ మారిపోయారు. మరి దీని వెనుక ఏంజరిగింది ? ఏం జరుగుతోంది ? అనేది ఇప్పుడు మహానాడు వేదికగా చర్చకు రావాల్సిన అంశం.
నిజానికి మహానాడు అత్యంత కీలకమైన వేదిక. అయితే.. ఇప్పుడు దీని స్వరూప స్వభావాలు మారిపోతాయనే ప్రచారం ఉంది. మెప్పులకు, గొప్పలకు వేదికగా మారుస్తూ.. విమర్శలకు ప్రధాన సమయం కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే.. ఇప్పుడు ఇలాంటి వాటితోనే సరిపెట్టడం కాదు.. వాస్తవాలను గుర్తించేలా చంద్రబాబు చర్చకు సిద్ధమవ్వాలి. అసలు ఏం జరిగింది ? ఏం జరుగుతోంది ? వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారబోతోంది ? ఇప్పుడు పార్టీని పట్టుకుని వేలాడుతున్న వారి పరిస్థితి ఏంటి ? అనే కీలక అంశాలు సహా.. అత్యంత కీలకమైన నాయకులు పార్టీకి దూరం కావడం పైనా బాబు చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.