కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా తొలి విడత లాక్‌డౌన్‌ను మార్చి 25వ తేదీ నుంచి అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాత్రికి రాత్రే లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రజలకు కనీసం ఊపిరి పీల్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పటికే ఎన్నో లక్షల మంది వలస కార్మికులు, ఇతర ప్రాంతాలకు చెందిన అనేక చోట్ల చిక్కుకుపోయారు. కనీసం వారందరూ సొంత ఊళ్లకు వెళ్లే సమయం కూడా ఇవ్వలేదు. అసలు ఈ విషయంపై కేంద్రం ఆలోచించిందో, లేదో తెలియదు కానీ.. హడావిడిగా లాక్‌డౌన్‌ను అమలు చేశారు. అయితే అది మన మంచికే అయినా.. అప్పుడు వారు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు సరైంది కాదని అనిపిస్తోంది.
లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నామని కేంద్రం చెబుతూ.. దశలవారీగా పలు కార్యకలాపాలకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే ఎన్నో లక్షల మంది వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఇంకా వారి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారందరూ బస్సులు, రైళ్లు, విమానాల్లో సొంత ఊళ్లకు తిరిగి వస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా.. కొందరు వలస కార్మికుల వివరాలు మాత్రం ఇంకా రాష్ట్రాలకు తెలియడం లేదు. బస్సులు, రైళ్లు, విమానాల్లో వచ్చే వారి వివరాలు అధికారికం. కనుక వారి వివరాలను సేకరించడం, వారిపై నిఘా ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అనేక మంది వలస కార్మికులు కాలినడకన, సైకిళ్లపై, సొంత వాహనాల్లో గ్రామాలకు వెళ్లారు. గ్రామం అంటే ప్రధాన రహదారి వరకు ఓకే. కానీ షార్ట్‌కట్‌లలో వెళ్లిన వారి వివరాలు మాత్రం ప్రభుత్వాలకు ఇంకా తెలియదు. చత్తీస్‌గడ్ ప్రభుత్వమే ఇందుకు ఉదాహరణ. అక్కడ 40వేల మంది వరకు వలస కార్మికులు ఇలా షార్ట్‌కట్‌లలో వెళ్లినవారే. దీంతో వారి ఆచూకీ తెలియడం లేదు. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇలాంటి వారు ఉన్నారా ? అనే సందేహం ప్రస్తుతం కలుగుతోంది.
ప్రధాన మార్గాల ద్వారా వెళ్లిన వారి వివరాలను అయితే అధికారులు సేకరించారు కానీ.. అలా షార్ట్‌కట్‌లలో, కాలినడకన, సైకిళ్లపై వెళ్లిన వారి వివరాలు ప్రభుత్వాలకు ఇంకా తెలియవు. వారిని గుర్తించడం కష్టమే. దీంతో వారి వల్ల కరోనా సామూహిక వ్యాప్తి ప్రారంభమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ విధించడానికి ముందే కార్మికులందరినీ అధికారికంగా తరలించి ఉంటే.. ఇప్పుడీ కష్టం వచ్చేది కాదు కదా.. అలాగే కరోనా కేసులు ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో నమోదు అయ్యేవి కూడా కాదు. ఈ క్రమంలో అప్పుడు కేంద్రం సరిగ్గా నిర్ణయం తీసుకోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా.. అలాంటి వలస కార్మికులను, ఇతర ప్రయాణికులను గుర్తించకపోతే కరోనా ఇంకా విజృంభించడం ఖాయం అని చెప్పవచ్చు.