యువజంట క్షణికావేశం ఎంతపని చేసింది.. ?

-

నేటికాలంలో ప్రాణాలు తీసుకోవడమంటే మరీ సులువుగా మారిపోయింది.. చీటికి మాటికి చంపుకోవడాలు, చావడాలు ఇదే ప్రస్తుతం లోకం పోకడ.. చావడానికి చేసే ధైర్యాన్ని బ్రతకడానికి చేయాలనే ఆలోచన లోపిస్తున్న వారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు.. ఇకపోతే ఎవరు ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నా దానికి బలమైన మానసిక, శారీరక, సాంఘీక కారణం ఉంటుంది. వారి స్దానంలో ఉంటే తప్ప వారి మానసిక సంఘర్షణ ఎవరికీ అర్ధం కాదు. కానీ సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు.. ఈ విషయాన్ని గుర్తించలేని ఓ యువజంట అర్ధం లేని ఆలోచనతో ఆత్మహత్య చేసుకున్నారు.. ఆ వివరాలు చూస్తే..

కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (24), నవాబుపేటకు చెందిన శ్రావణి (21) వీరిద్దరు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ నెల 10 వ తేదీన శ్రావణి తన పుట్టింటికి వెళ్లి వస్తానని భర్త వెంకటేశ్వరరావును కోరగా, అందుకు అతడు నిరాకరించటంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన ఆమె భర్త వెంకటేశ్వరరావు వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత, విజయవాడ తరలించారు.

 

అప్పటికే పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా తన భార్య పరిస్థితి సీరియస్ అని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేని వెంకటేశ్వరరావు ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వాస్పత్రి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా శ్రావణి శుక్రవారం ఉదయం మృతి చెందగా, హస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర మరణించాడు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..

Read more RELATED
Recommended to you

Latest news