రాజకీయ నాయకులు అంటే.. అంతే.. ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకమే. ప్రజలు ఆశించింది వారు ఎన్నటికీ చేయరు. వారు ఒక దారిలో వెళ్తే.. నేతలు అందుకు విరుద్ధంగా వెళ్తారు. అవును.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. కరోనా లాక్‌డౌన్ విధించినప్పుడు కేసులు వందల్లో ఉన్నాయి. జనాలు బయట కనిపిస్తే వీపులు వాయగొట్టారు. కానీ ఇప్పుడు కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అయినా లాక్‌డౌన్ లేదు. మరోవైపు జనాలు మాత్రం స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. మన నేతలు మన వైఖరికి ఎంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి.
అసలు నిజానికి మొదట్నుంచీ కరోనా కట్టడిపై ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేదు. లాక్‌డౌన్ వల్లే కరోనా కట్టడి అవుతుందని భావించి ఏకంగా రెండు నెలలకు పైగానే జనాలను ముప్పు తిప్పలు పెడుతూ ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టనివ్వలేదు. అయినా కరోనా కేసులు నమోదయ్యాయి. కాకపోతే అప్పుడు ఆ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందనే కారణాలు చెప్పి అన్‌లాక్ దిశగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అసలు కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్ పెట్టి, ఎక్కువగా ఉన్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ను తీసేయడం వెనుక ఉన్న మర్మమేమిటో నిజంగా నేతలకే తెలియాలి.
కరోనా కట్టడికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఏదీ లేదు. ఏ ప్రభుత్వమూ ఇలాంటి ఆపదను గతంలో ఎదుర్కోలేదు. కనుక.. ఏం చేయాలో కూడా ప్రభుత్వాలకు తెలియడం లేదు. అలాంటప్పుడు అస్తవ్యస్తమైన విధానాలతో జనాలను ఇబ్బందులు పెట్టడం దేనికి ? ఏదో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ముందుకు సాగితే స్పష్టత వచ్చేది. కానీ కొంత సేపు లాక్‌డౌన్ పెట్టి, కొంత సేపు తీసేసి, కొన్ని సార్లు టెస్టులు ఎక్కువ చేసి, కొన్ని సార్లు తగ్గించి.. ఇలా అస్తవ్యవస్తమైన విధానాలతో జనాలను భయపెట్టడమే కాదు, కరోనా ఉగ్రరూపం దాల్చేందుకు ప్రభుత్వాలు కారణమవుతున్నాయి.
ఇక ప్రభుత్వాలు చెప్పే మాటలకు విసుగు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఇది శుభ పరిణామం. ప్రభుత్వాలకు ఇది మేలుకొలుపు లాంటిది. మీరు పట్టించుకోకుంటే కనీసం మేమైనా జాగ్రత్తగా ఉండాలిగా.. అంటూ జనాలు ఇప్పుడు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. మరి ఈ విషయం నేతల కళ్లు తెరిపిస్తుందా ? కరోనా కట్టడిపై నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వాలు ముందుకు సాగుతాయా ? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది..!