దేశ ప్రజల సమాచారాన్ని చోరీ చేస్తున్నాయనే కారణంతో మొత్తం 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ 59 యాప్‌లను తమ ప్లే స్టోర్ నుంచి పూర్తిగా తొలగించినట్లు గూగుల్ తెలిపింది. ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలానుసారం ఆ యాప్‌లను తొలగించామని గూగుల్ తెలిపింది. మళ్లీ కేంద్రం చెప్పేవరకు ఆ యాప్‌లను ప్లే స్టోర్‌లో అనుమతించబోమని తెలిపింది.
”భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 59 చైనా యాప్‌ను మా ప్లేస్టోర్ నుంచి తాత్కాలికంగా తొలగించాం. ఈ పరిస్థితిపై ప్రస్తుతం సమీక్షిస్తున్నాం. ఇదే విషయంపై ఆయా యాప్ డెవలపర్లకు సమాచారం ఇచ్చాం. భవిష్యత్తులో భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం.. ఆ యాప్‌లను మళ్లీ ప్లే స్టోర్‌లో పెట్టాలా, వద్దా అన్నది తేలుస్తాం..” అని గూగుల్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
అయితే ఆయా యాప్‌లను ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించారు. కానీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో సంబంధం లేని ఆ యాప్‌లను ఇదివరకే ఇన్‌స్టాల్ చేసుకుని ఉన్నవారు వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఇక ఇంటర్నెట్ ఉంటేనే నడిచే టిక్‌టాక్, హలో వంటి యాప్‌లు మాత్రం ప్రస్తుతం పనిచేయడం లేదు.