మనుషులన్నాక అన్నం తింటారు.. మేకలన్నాక ఆకులు తింటాయి. ఇది సృష్టి ధర్మం. కానీ, మేకలు ఆకులు తినడం తప్పు అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ అధికారులు. పైగా ఆకులు తిన్నందుకు 15 మేకలను అదుపులోకి తీసుకొని.. వాటికి జరిమానా కూడా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరోదశను ఈ ఏడాది జనవరిలో చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 30 కోట్ల మొక్కలను నాటుతున్నట్టు చెప్పారు.
అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే గురువారం నాడు ఇల్లందులోని దాదాపు 15 మేకలు మొక్కలు తింటున్నట్టు మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి తెలియజేశారు. దీంతో, ఆయన ఆదేశాల మేరకు ఆ మేకలను పట్టుకున్నారు సిబ్బంది. అనంతరం వాటిని మున్సిపల్ ఆఫీసులో తరలించారు. అలాగే జరిమానా చెల్లించి మేకలను తీసుకెళ్లాలని వాటి ఓనర్లకు సందేశం పంపారు. అయితే ఇప్పటివరకు వాటి ఓనర్లు ఎవరూ రాలేదని తెలుస్తోంది.