మాతృభాషలోనే బోధించాలనే నిబంధన ఎక్కడా లేదని.., జాతీయ విద్యా విధానంపై ఏపీ ప్రభుత్వం తరపున అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యనించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా వారధి వాహనాలను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య అందించేందుకు సంచార విద్యా వారధి వాహనాలు ఉపయోగపడతాయన్నారు. కరోనా వ్యాప్తి వల్ల పాఠశాలలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని డిజిటల్ విధానం ద్వారా చదువును పిల్లలకు చేరువ చేస్తున్నామన్నారు.
“లాక్డౌన్ వల్ల విద్యాశాఖ షెడ్యూల్ మొత్తం తారుమారైంది. పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంది. సెప్టెంబరు ఐదు నుంచి పాఠశాలలు నిర్వహించాలని సీఎం సూచించారు. అందుకు అనుగుణంగా మేము అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. మారుమూల ప్రాంతాలలో విద్యార్థులకు విద్యా వారధి పేరుతో మొబైల్ వాహనాల ద్వారా పాఠాలు చెబుతాం. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ డిజిటల్ విధానం ద్వారా క్లాసులు నిర్వహిస్తాం. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలలో కూడా ఈ మొబైల్ వాహనాలను పంపిస్తాం. పాఠశాలల్లో బోధనలు ప్రారంభం అయ్యే వరకు అన్ని జిల్లాల్లో ఈ మొబైల్ వాహనాల ద్వారా చదువు నేర్పిస్తాం.” అని మంత్రి సురేశ్ వెల్లడించారు.