జగన్ మౌనం… కోర్టే మాట్లాడింది… బాబుకు షాక్!

-

గత టీడీపీ ప్రభుత్వంలో చేతలకంటే.. మాటలు, వాటి తాలూకు ప్రచారాలు ఎక్కువగా ఉండేయనే విమర్శలు బలంగా వినిపించేవి! ఈ క్రమంలో జగన్ సీఎం అయినప్పటినుంచీ.. అటు రాజకీయంగా అయినా, ఇటు పరిపాలన పరంగా అయినా.. ప్రభుత్వం నుంచి మాటలు తక్కువ, పనులు ఎక్కువగా జరుగుతున్న సందర్భాలు ఏపీలో కోకొల్లలు! ఈ క్రమంలో చంద్రబాబు గత కొంతకాలంగా ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై జగన్ ఇప్పటివరకూ స్పందించలేదు సరికదా… బాబు & కోలకు కోర్టులే సమాధానం చెప్పినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు!

ఏకంగా 150కోట్ల అవినీతి కేసులో మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే… దాన్ని బీసీలపై దాడిగా అభివర్ణించారు చంద్రబాబు. అక్కడ అవినీతి జరగలేదని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపని చెప్పుకొచ్చారు. ఇదేక్రమంలో మరింతగా మాట్లాడిన తమ్ముళ్లలో… రాష్ట్రంలోని బీసీలంతా ఏకమవ్వాలని ఒకరంటే.. ఏపీలో బీసీలు లేకుండా చేయాలనే ఆలోచనలో భాగమే అచ్చెన్నాయుడు అరెస్ట్ అన్న రేంజ్ లో మరొకరన్నారు.

ఇక అక్రమాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తే… రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని ఫైరయ్యారు. లోకేష్ అయితే జేసీ ఇంటికివెళ్లి… విషయం తెలుసుకోకుండా, ఇవి తప్పుడు కేసులు అని సర్టిఫై చేసేశారు!

ఇదే క్రమంలో… బీసీ సామాజిక‌వ‌ర్గానికే చెందిన మోకా భాస్క‌ర‌రావు అనే వ్య‌క్తి హ‌త్య కేసులో కొల్లు ర‌వీంద్రను అరెస్టు చేశారు పోలీసులు. ఆ హ‌త్య కేసులో త‌న పేరు వినిపించ‌గానే పోలీసుల‌కు దొర‌క‌కుండా పారిపోయే ప్ర‌య‌త్నం చేయడంతో.. పోలీసులు వెంబ‌డించి ప‌ట్టుకున్నంత ప‌ని చేశారని తెలుస్తోంది. ఈ విషయంలో కూడా… మరణించిన వ్యక్తి కూడా బీసీ అని మరచిన బాబు… కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం బీసీలపై దాడి అని చెప్పుకొచారు. అనంతరం వైకాపా నేతల నుంచి కౌంటర్స్ పడేసరికి మౌనం దాల్చారు!

ఇవి తప్పుడు కేసులు కాదని.. వీరిపై నమోదైన కేసుల్లో విషయం ఉందని.. ఆ విషయంలో వీరి ప్రమేయం ఉందని.. చెప్పినంత పనిచేసింది కోర్టు! అందులో భాగంగానే వీరు ముగ్గురికి వరుసపెట్టి బెయిల్ పిటిషన్స్ ని తిరస్కరించింది! దీంతో… ఇవి తప్పుడు కేసులు కాదన్న విషయం జగన్ & కో మైకులముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా… బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం ద్వారా కోర్టే చెప్పినంత పనైందని.. ఇది బాబు “బీసీ కార్డు” రాజకీయానికి, రాజకీయ కక్షసాధింపు అనే విమర్శలకు చెంపపెట్టని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news