సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసును సీబీఐకి అప్పగించాలని ముంబైలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అతుల్ భట్కాల్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన సందేశం ఇచ్చారు. సుశాంత్ సింగ్ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని తాను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశానని ఎమ్మెల్యే భట్కాల్కర్ తెలిపారు. సుశాంత్ సింగ్ చనిపోయినప్పటి నుంచి ముంబై పోలీసులు అతని కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని, ఎందుకంటే.. అతని మృతికి ముంబైకి చెందిన ఓ యువ మంత్రికి లింక్ ఉందని, కనుకనే ముంబై పోలీసులు ఈ కేసును లైట్ తీసుకుంటున్నారని ఆరోపించారు. అందుకని సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసు విషయమై సీబీఐచే విచారణ జరిపించాలన్న డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. బీహార్ మంత్రి మహేష్ హజారి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా అనేక మంది ఇప్పటికే ఈ కేసులో సీబీఐ జోక్యం అవసరమన్నారు. సుశాంత్ ను ఎవరో హత్య చేశారని, అది ఆత్మహత్య ఎంత మాత్రం కాదన్నారు.