బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. అతడి మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. బిహార్‌లోని పట్నాలో తనపై దాఖలైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై ఆగస్టు 5న విచారణ జరగనుంది. సుశాంత్ సింగ్ బలవన్మరణానికి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌సింగ్ తండ్రి పట్నాలో కేసు నమోదు చేశారు. దీనిపై సుప్రీంకు వెళ్లిన రియా ఆ కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరారు.
జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్లో వాదనలు విననుంది.అయితే ఈ కేసులో ఏదైనా నిర్ణయాన్ని వెల్లడించే ముందు తమ వాదనలు కూడా వినాలని మహారాష్ట్ర పోలీసులు, బిహార్ పోలీసులతో పాటు సుశాంత్‌సింగ్ తండ్రి కూడా సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.నటుడు.. సుశాంత్ జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ఈ కేసులో వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు సినీ ప్రముఖుల్ని ప్రశ్నించారు.