సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటికే ప్లేయర్లందరూ సిద్ధమవుతున్నారు. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లకు టచ్‌లోకి వచ్చాయి. దీంతో షెడ్యూల్, హోటల్స్ బుకింగ్.. తదితర పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు బీసీసీఐ కూడా ఐపీఎల్ షెడ్యూల్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే టోర్నీ విషయమై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ యజమాని నెస్ వాడియా మాట్లాడుతూ.. టోర్నీ సందర్భంగా ఒక్క కరోనా కేసు నమోదైనా టోర్నీ నాశనమవుతుందని అన్నారు.
ఇంగ్లండ్, వెస్టిండీల మధ్య ఇటీవల టెస్టు సిరీస్ ముగిసింది. మరోవైపు పాకిస్థాన్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ రెండు సిరీస్‌లకూ బయో సెక్యూర్ బబుల్ వాతావరణం కల్పించారు. అయితే ఐపీఎల్ వేరే.. మొత్తం 8 జట్లు తమ సభ్యులు, సిబ్బందితో సహా.. సుమారుగా 60 రోజుల పాటు యూఏఈలో ఉండాలి. అందువల్ల కరోనా వ్యాప్తి జరగకుండా చూడడం బీసీసీఐకి సవాల్‌గా మారిందని నెస్ వాడియా ఆందోళన వ్యక్తం చేశారు.
ఐపీఎల్ టోర్నీ సందర్భంగా కరోనా వ్యాప్తి జరిగితే పరిస్థితి ఏమిటనే విషయంపై ప్రస్తుతం ఫ్రాంచైజీల మధ్య చర్చ నడుస్తుందని నెస్ వాడియా అన్నారు. అయితే ఫ్రాంచైజీలకు ప్లేయర్ల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ ఉందని తెలిపారు. అయితే మరోవైపు వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్‌ను వెదకడం కూడా బీసీసీఐకి కష్టంగా మారిందన్నారు. ఇంత తక్కువ సమయంలో బిడ్లను ఆహ్వానించి స్పాన్సర్లను వెదకాలంటే కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. అయితే.. ఐపీఎల్ టోర్నీ సందర్భంగా ప్లేయర్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా చూసేలా తమ టీం బాధ్యత వహిస్తుందని తెలిపారు.