ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలో అంతర్గత పోరు రోజురోజుకి తీవ్రంగా మారుతుంది. గత కొద్ది నెలలుగా వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ.. సొంత పార్టీ నేతలకే కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఇటీవల వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన తప్పుపట్టారు. అమరావతిలో పర్యటించి రైతులకు మద్దుతుగా నిలుస్తానని చెప్పారు. అయితే వీటిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందిస్తూ.. రఘురామకృష్ణంరాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రఘురామకృష్ణంరాజు ఎవరో జనానికి తెలియదని, కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో తోనే ఆయన ఎన్నికల్లో గెలిచారని ఆయన అన్నారు. పైగా 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు, తమ అధినేత వైఎస్ జగన్ కాళ్లు పట్టుకుని ఎంపీ టికెట్ తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.