కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా ఎఫెక్ట్ దేశంలోని ఆలయాలపై కూడా పడింది. ఆలయాలకు వచ్చే భక్తులు లేక ఆదాయాన్ని కోల్పోయాయి. ఇక కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థాన్ బోర్డ్ (టీడీబీ) పరిధిలో ఉన్న 1248 ఆలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ ఆలయాల్లో శబరిమల ఆలయం కూడా ఉండడం విశేషం. భక్తులు రాక ఆదాయం భారీగా పడిపోవడంతో ఇప్పుడు ఖర్చులను వెళ్లదీసేందుకు ఆయా ఆలయాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నాయి.
కేరళలో టీడీబీ పరిధిలోని 1248 ఆలయాలు ఖర్చులను భరించేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు యోచిస్తున్నాయని టీడీబీ అధ్యక్షుడు ఎన్.వాసు మీడియాకు తెలిపారు. అయితే ఆలయాల వద్ద ప్రస్తుతం 3 ఆప్షన్లు ఉన్నాయన్నారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని ఆర్బీఐ వద్ద తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం లేదా గోల్డ్ మానెటైజేషన్ స్కీం కింద మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఆఫర్‌ను వినియోగించడం లేదా ఈ రెండు ఆప్షన్ల ద్వారా బంగారంతో డబ్బులు పొందడంపై ఆలయాలు దృష్టి పెట్టాయని తెలిపారు.
కేరళలోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 1248 ఆలయాలు టీడీబీ పరిధిలోకి వస్తాయి. వాటిల్లో శబరిమల ఆలయం కూడా ఉంది. అయితే ఆయా ఆలయాలు ఇప్పుడు తమ వద్ద ఎంత పరిమాణంలో బంగారం ఉందనే విషయాన్ని లెక్కిస్తున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే ఆ బంగారాన్ని పై విధంగా ఉపయోగించి ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని ఆలోచిస్తున్నాయి. ఇక కరోనా వల్ల ఇప్పటికే అన్ని ఆలయాలకు కలిపి దాదాపుగా రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని వాసు తెలిపారు. అయితే ఆర్బీఐ వద్ద బంగారాన్ని తాకట్టు పెడితే తక్షణమే రుణం వస్తుందని, అదే గోల్డ్ మానెటైజేషన్ స్కీం కింద గోల్డ్ బాండ్స్‌ను తీసుకుంటే ఏడాదికి వాటిపై 2.5 శాతం వరకు వడ్డీ లభిస్తుందని, కనుక ఈ రెండు ఆప్షన్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఇక ఈ విషయమై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టతను తీసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా ఇదే విషయమై టీడీబీ ప్రతినిధులు ఆగస్టు 22న కేంద్రంతో చర్చలు కూడా జరిపారు. దీంతో త్వరలోనే ఈ విషయంపై వారు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా అన్ని ఆలయాలు కలిపి సుమారుగా 1000 కేజీల బంగారాన్ని పై విధంగా వినియోగించి డబ్బులు పొందాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై టీడీబీ త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేయనుందని తెలిసింది.