కార్తీక మాసం స్పెషల్: ఏ తిథి నాడు ఏ పూజ చేయాలి…?

-

కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం. అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి ఉన్నమాసాన్నే కార్తీక మాసం అంటారు. ఇది శివ, కేశవ, కార్తీకేయ, శక్తి స్వరూపా దేవతలకు ప్రీతికరమైనదిగా ప్రతీతి. ఈమాస ప్రత్యేకతలను పరిశీలిస్తే కుమారస్వామి పుట్టింది, సృష్టి ఆరంభమైన నెలగా, త్రేతాయుగం ప్రారంభమైన మాసంగా ప్రసిద్ధి చెందింది.

సైన్స్ పరంగా: వర్షాకాలం పూర్తయి నదులు, జలశయాలు పూర్తిగా నీటితో నిండి ఉంటాయి. అదే సమయంలో శరత్‌కాలం కావడం చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటంతో చంద్రుని వెన్నలతో జలాలు అన్ని అమృత తుల్యం అవుతాయి. వర్షాలతో నిండిన నదులు, చెరువులు, కాలువల్లో నీరు తేటగా మారి శుభ్రంగా ఉండే సమయం ఇది. కొండకోనల్లోనుంచి వచ్చిన ఈ నీరు ఓషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ నీటిలో స్నానం ఆచరిస్తే ఆరోగ్య కరంగా ఉంటుందనేది సైన్స్. అదేవిధంగా రాబోయే శీతాకాలానికి తగ్గట్టుగా శరీరాన్ని మలచడం కూడా దీనిలో భాగంగా పూర్వీకులు ఈ ఆచారాలను, ఉపవాసాలను ఏర్పాటుచేశారు.

ఏ తిథినాడు ఏ పూజ చేయాలి…?

నవంబర్ 12 నుంచి పరిశీలిద్దాం…

శుద్ధమునందు (పౌర్ణమికి ముందు)

పంచమి: జ్ఞాన పంచమి. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయాలి.

షష్టి: సుబ్రమణ్యస్వామి ఆరాధన. ముఖ్యంగా సంతాన ప్రాప్తి, వివాహం కానివారు ఈరోజు బ్రహ్మచారులకు ఎర్రటి వస్ర్తాలు దానం చేయడం, భోజనం పెట్టడం లేదా భోజనద్రవ్యాలు దానం చేయడం చేస్తే ఫలితం వస్తుంది.

సప్తమి: సూర్యుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు గోధుమలు దానం చేయడం చేయాలి. ఆరోగ్యం కోసం ఈ ప్రక్రియ చాలా మంచిది. ఆవులకు దానా వేయడం కూడా చేయవచ్చు.

అష్టమి: గోపూజ ప్రత్యేకం. దీన్నే గోపాష్టమి అంటారు. గోశాలకు వెళ్లడం గోవులను పూజించడం, గోశాలకు విరాళాలు ఇవ్వడం చేయాలి. అమితమైన ఫలితాలు కలుగుతాయి.

నవమి: విష్ణుపూజ. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

దశిమి: ఈరోజు కూడా విష్ణుపూజకు పేరుగాంచింది.

ఏకాదశి: దీన్నే ప్రభోధ/బోధనైకాదశి అంటారు. విష్ణు ఆరాధన చేస్తే విష్ణు సాయుజ్యం లభిస్తుంది. ఏకాదశి వ్రతం పాటిస్తే అమితమైన ఫలితం లభిస్తుంది.

ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధిగాంచింది. ఉసిరి, తులసి మొక్కల వద్ద పూజ, దీపారాధన చేయాలి. దీనివల్ల విష్ణుప్రీతి కలిగి విష్ణు భగవానుడి విశేష అనుగ్రహం లభిస్తుంది.

త్రయోదశి: నవగ్రహపూజలు. సాలగ్రామదానాలు చేయాలి.

చతుర్దశి: పాషాణ చతుర్దశి అంటారు. ఈ రోజు విష్ణు, శివ పూజలు చేయాలి.

పౌర్ణమి: ఈ మాసంలో అత్యంత ప్రత్యేకమైన తిథి ఇది. తప్పక కార్తీకస్నానం ఆచరించి ఇంట్లో/దేవాలయంలో దీపారాధన చేయాలి. శివ, కేశవులను ఆరాధించాలి. శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణోత్సవాల్లో తప్పక పాల్గొనాలి. శివుడికి అభిషేకం, బిల్వపత్రార్చనలు, విష్ణు ప్రీతికోసం సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే గొప్ప ఫలితాలు లభిస్తాయి.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news