అమరావతి(చిత్తూరు): ఆంధ్రప్రదేశ్‌లో అరాచక,అవినీతి పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 30 యాక్టు,144 సెక్షన్ల ఎందుకు విధించారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంచార్జి అరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటు కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీడీపీ పాలనపై ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు.
ప్రజలను మోసం చేసి సీఎం చంద్రబాబు గద్దెనెక్కారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ.. బాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాల్సిందేని ఎద్దేవాచేశారు. తెలుగు పప్పు లోకేష్‌కు తోడుగా రాహుల్ పప్పు చేరారని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలవకుండా చేయాలని, చంద్రబాబు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు, పచ్చి నవ్వులు నవ్వుతున్నారని రోజా పేర్కొన్నారు.