టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే తన కస్టమర్లకు గాను పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్లను ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగా సదరు ప్లాన్లను తీసుకునే కస్టమర్లకు విమానాల్లోనూ సేవలు అందించనున్నట్లు తెలిపింది. విమానాల్లో ఆ కస్టమర్లు కాల్స్, డేటా వంటి సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. అయితే ముందుగా విదేశాలకు ప్రయాణించే వారి కోసం 22 అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో జియో ఇన్ ఫ్లైట్ మొబైల్ సర్వీస్‌లను అందించడం ప్రారంభించింది. త్వరలోనే దేశీయ విమాన సర్వీసుల్లోనూ ఈ సేవలు జియో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం 22 అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ కస్టమర్లకు ఇన్ ఫ్లైట్ మొబైల్ సర్వీస్‌లు లభిస్తున్నాయి. ఎయిర్ లింగస్, ఎయిర్ సెర్బియా, అలిటాలియా, ఏషియానా ఎయిర్ లైన్స్, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, కాథే పసిఫిక్, ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, యూరో వింగ్స్, ఇవా ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, మలేషియా ఎయిర్‌లైన్స్, మలిండో ఎయిర్, ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, స్విస్, ట్యాప్ ఎయిర్ పోర్చుగల్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ విమాన సర్వీసుల్లో జియో ఇన్ ఫ్లైట్ మొబైల్ సర్వీస్‌లను కస్టమర్లు ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు.
ఇక ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే కస్టమర్లు విమానంలో 20వేల అడుగుల ఎత్తుకు చేరాక మొబైల్ ను స్విచాన్ చేయాలి. ఫోన్ ఆటోమేటిగ్గా ఎరో మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. యూజర్ వాడే మొబైల్ హ్యాండ్ సెట్ ను బట్టి నెట్వర్క్ నేమ్ మారుతుంది. ఒక వేళ నెట్వర్క్ కు ఆటోమేటిగ్గా కనెక్ట్ అవకపోతే మాన్యువల్‌గా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డేటా రోమింగ్ సర్వీస్‌ను ఆన్ చేయాలి. దీంతో వెల్కమ్ టెక్ట్స్ వస్తుంది. తరువాత వినియోగదారులు విమానంలో కాల్స్, డేటా సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.