షార్జా వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయిన పంజాబ్ 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (106 పరుగులు, 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (69 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)లు విజృంభించడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో మాక్స్‌వెల్ (13 పరుగులు, 2 ఫోర్లు), నికోలాస్ పూరన్ (25 పరుగులు, 1 ఫోర్, 3 సిక్సర్లు)లు బ్యాట్‌లు ఝులిపించారు. ఈ క్రమంలో పంజాబ్ జట్టు రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
కాగా రాజస్థాన్ బౌలర్లలో రాజ్‌పూత్, టామ్ కుర్రాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచి పంజాబ్ దూకుడుగా ఆడింది. 183 పరుగుల వరకు పంజాబ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తరువాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా రాజస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలో పంజాబ్ భారీ స్కోరే చేయగలిగింది.