‘ కాపు’ సీఎం ‘ నినాదం తో బీజేపీ ? పవన్, సోము రెఢీనా ?

-

ఏదో రకంగా ఏపీలో పాగా వేయాలనే దృఢమైన సంకల్పంతో బిజెపి ఉంది. ఇప్పటి వరకు బిజెపి ఏపీలో ఎదగక పోవడానికి కారణాలు ఏమిటో అర్థం చేసుకోవడంతో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది. ఆయన ఆ పదవిలో కూర్చోగానే కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేసి, టిడిపికి పరోక్షంగా సహకరిస్తూ వస్తున్నారు అనే అనుమానం ఉన్న నేతలందరినీ పక్కనపెట్టి తమదే పెత్తనం అనే అభిప్రాయం సైతం ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక కుల రాజకీయాలకు పనిలో పనిగా పదును పెట్టేసినట్టుగా కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఇప్పుడు అదే సామాజిక వర్గంలో బలం, బలగం బిజెపి కి ఉండేలా చక చక ప్లాన్లు చేసుకుంటున్నారు.

ఎలాగూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, తమకు అన్ని విధాలా కలిసి వస్తుందనే అభిప్రాయంతో సోము వీర్రాజు ఉన్నారు. ఎప్పటి నుంచో కాపు సీఎం అనే నినాదం ఏపీ లో బలంగా ఉండటం, ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి ఆ కలను నెరవేర్చలేకపోవడం ఇలా అన్ని లెక్కలు వేసుకున్న బిజెపి ఇప్పుడు ఏపీకి బిజెపి తరఫున కాబోయేది కాపు సీఎం అంటూ కొత్త ప్రచారం మొదలు పట్టింది. కాపులకు సీఎం పదవి అనగానే, ఆ సామాజిక వర్గం మొత్తం తమ వైపు తిరుగుతుందనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఏపీలో ఎవరికి లేనంత స్థాయిలో ఫాలోయింగ్ ఉండడం, కాపులకు ప్రస్తుతం ఆరాధ్యదైవంగా పవన్ ఉండడంతో ఇదంతా జరగాలంటే కాపులు అందరూ ముందుగా బీజేపీని బలోపేతం చేయాలనే సంకేతాలను ఇప్పుడు ఆ పార్టీ పంపుతోంది.

ఇప్పటికే కాపు సంఘాల్లో పట్టున్న నాయకులందరికీ, ఏపీ బీజేపీ శాఖ నుంచి ఫోన్ లు సైతం వెళ్ళినట్లుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. వారు పార్టీలో చేరితే ప్రాధాన్యం ఇస్తామని రాయబారాలు పంపించింది. ఇప్పుడు ఏపీలో ఎలాగూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తమకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయంతో బిజెపి ఇప్పుడు కాపు సీఎం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నినాదం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో, ఆ పార్టీ నేతలకే తెలియాలి.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news