దుబాయ్‌లో సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 19వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఒకరి తరువాత ఒకరు వచ్చినట్లే వచ్చి వికెట్లను చేజార్చుకున్నారు. ఏ దశలోనూ పోరాటాన్ని ప్రదర్శించలేదు. దీంతో విజయం ఢిల్లీ కైవసమైంది.
మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆ జట్టు 196 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో మార్కస్ స్టాయినిస్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు శిఖర్ ధావన్ (32 పరుగులు, 3 ఫోర్లు), రిషబ్ పంత్ (37 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు కూడా రాణించారు. దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, మొయిన్ అలీ, ఉదానాలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఒక్క కోహ్లి మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 39 బంతులు ఆడిన కోహ్లి 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. కోహ్లి కొంత సేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా మిగిలిన ప్లేయర్ల నుంచి అతనికి సహకారం లభించలేదు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే నోర్జె, అక్షర్ పటేల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అశ్విన్ 1 వికెట్ తీశాడు.