ఆ మాజీ మంత్రి రాకతో మళ్ళీ తెర పైకి గ్రూప్ పాలిటిక్స్…!

-

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడ సీట్లు ఎక్కువే.. నాయకులు ఎక్కువే. అంతేకాదు గ్రూపు రాజకీయాలూ ఎక్కువే. గ్రూపుల్లో ఒకదానికి మరొకదానితో పడదు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఒక గ్రూపులోకూడా అనేక లుకలుకలు కనిపిస్తాయి. చివరికి ఈ పంచాయితీలు తీర్చటానికి ఏకంగా పార్టీ అధినేతే రంగంలోకి దిగాల్సి వస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం సాధారణంగా పెద్దగా వార్తల్లోకి రాదు. గత టిడిపి ప్రభుత్వంలో ఇక్కడి నుంచి గెలిచిన జవహర్ మంత్రి కావడంతో ఒక్కసారిగా కొవ్వూరు నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. అయితే, జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతలే తమను హీనంగా చూస్తున్నారని ఫిర్యాదులు వినిపించాయి. దళిత నేత జవహర్ మంత్రి పదవిలో ఉన్న సమయంలో పార్టీలోన దళితులకే సమస్యగా మారారని పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి.

దీంతో 2019 ఎన్నికల్లో జవహర్ అక్కడి నుంచి తప్పించి ఆ సీటును అనితకు ఇచ్చాడు చంద్రబాబు. జవహర్ కృష్ణాజిల్లా తిరువూరు నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు చోట్ల టిడిపి ఓటమి పాలవటంతో, చంద్రబాబు నాయకుల మార్పు ప్రయోగం బెడిసి కొట్టినట్టయింది. ఇవన్నీ ఇలా ఉంటే కొవ్వూరు నియోజకవర్గ నేతలకు మాత్రం కొత్త భయం పట్టుకుంది. జవహర్ ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమించడంతో మళ్ళీ ఆ నియోజకవర్గం లో గ్రూపులు తెరపైకి వచ్చాయి.

గతంలో ఎలాగోలా ఇక్కడి నుంచి పంపించి వేస్తే మరో సారి తమపై పెత్తనం చేయడానికి జవహర్ వస్తున్నాడనే టాక్ మొదలయింది. ఈ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారట కొవ్వూరు నియోజకవర్గ తమ్ముళ్లు.ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట. కొవ్వూరు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోది కావటంతో, జవహర్ పార్లమెంట్ ఇన్ చార్జ్ అయితే తమ నియోజకవర్గంపై కూడా మరోసారి పెత్తనం చేసే అవకాశాలు ఉంటాయంటున్నాయని కంగారు పడుతున్నారు.

అయితే రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి అయిన తరువాత మొదటి సారి కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చిన జవహర్ కి ఒక గ్రూపు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మాత్రం మరో గ్రూపు టీడీపీ నాయకులు ఎవరు రాలేదు. ఇలా నియోజకవర్గం లో టీడీపీ రెండు గ్రూపులుగా చీలి కనిపిస్తోంది. ఇది చివరికి పార్టీకే నష్టమని మరికొందరు తటస్థ నేతలు బాధపడుతున్నారట. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమౌతున్నా చంద్రబాబు కొవ్వూరు లాంటి సమస్యలు మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news