తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితం వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే ఈ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 823 ఓట్లు పోలవ్వగా, 728 ఓట్లు సాధించిన కవిత తొలి రౌండ్లోనే విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటకే ఫలితం వచ్చేసింది. ఇక కవిత గత యేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచే సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసి మరి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ ఎన్నికల బరిలో ఆమె ఉండడంతో స్థానిక టీఆర్ఎస్ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కసితో పని చేసి కవితను భారీ మెజార్టీతో గెలిపించారు.
ఈ నెల 14న ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కవితకు వచ్చిన ఓట్లు చూస్తే గులాబీ శ్రేణులు సైతం షాక్ అయ్యేలా ఉన్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి మొత్తం 505 ఓట్లు ఉన్నాయి. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సెలర్లు, కార్పొరేటర్లను సైతం కారెక్కించేశారు. ఈ లెక్కన కవితకు ఎక్కువ ఓట్లు వచ్చే విషయంలో డౌట్ లేకపోయినా ఏకంగా 192 ఓట్లు ఎక్కువ రావడం గులాబీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కవితకు 100 ఓట్లు ఎక్కువ వస్తాయని ముందే ఊహించారు. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరగడంతో గులాబీ శ్రేణులు కూడా ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి.
మరోవైపు రెండు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా డిపాజిట్ కోల్పోవడంతో తలలు పట్టుకుంటున్నాయి. ఇక ఆరేళ్ల కాలపరిమితి ఉన్న ఈ ఎమ్మెల్సీ కాలం 2022లో ముగుస్తుంది. అంటే మరో రెండేళ్ల వరకు కవిత ఎమ్మెల్సీగా ఉంటారు. అప్పటి వరకు ఆమె ఎమ్మెల్సీగా ఉంటారా ? లేదా ? మంత్రి అవుతారా ? అన్న దానిపై కూడా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే కవిత కేసీఆర్ కేబినెట్లోకి వచ్చేస్తున్నారంటూ టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పటికే పూర్తి స్తాయి కేబినెట్ ఉన్నందున కేసీఆర్ కవితను కేబినెట్లోకి తీసుకోవాలంటే ఎవరెవరిని పక్కన పెడతారు ? అసలు ఈ ఈక్వేషన్లు ఎలా ఉంటాయి ? అన్నది కూడా చూడాలి.