మాజీ మంత్రి అమర్నాథరెడ్డి వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మోటర్ లకు మీటర్లు బిగించడం అంటే రైతుల వెన్నుముక విరిచి నట్టే అని ఆయన మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటక మద్యం ఏపీలో ఏరులై పారుతోంది అని అన్నారు. ఇది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఉపాధిహామీ గా మారిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తీరుపై కోర్టులు వెలువరిస్తున్న తీర్పులను తప్పు పట్టడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు.
మంత్రులు మాట్లాడుతున్న భాష అత్యంత ఘోరంగా ఉందని, ఇలాగే కొనసాగితే సరైనటువంటి సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కడుపు మండి ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ప్రభుత్వం పదేపదే ఎద్దేవా చేయడం మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానంలో వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం లూటీ చేసి ఏ గతికి చేరుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు.