వికారాబాద్ అడువుల్లో వికృత క్రీడ వారి పనేనా…?

-

హైదరాబాద్‌ శివారు అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట ఇంకా కొనసాగుతోందా? విలాస పురుషుల వన్యప్రాణుల వేట యధేచ్చగా సాగుతోందా? దీని పై పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.హైదరాబాద్‌ శివారు అటవీ ప్రాంతాల్లో జంతువులపై ఈ విధంగా తుపాకీ కాల్పులు జరగడం కొత్తేం కాదు. రెండేళ్ల క్రితం మన్నెగూడ శివారులో ఒక జింకపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత దామగుండం పరిధిలో వేటగాళ్ల చేతుల్లో పలు అటవీ జంతువులు బలైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆవుపై జరిగిన కాల్పులను ఆ కోణంలో చూస్తున్నారట అధికారులు.


వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో ఇటీవల ఒక ఆవును తుపాకీతో కాల్చి చంపారు. సమీప గ్రామాల నుంచి మేతకు వచ్చిన ఆవుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆవు యజమాని ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ, పోలీసు అధికారులకు అక్కడ కొన్ని బుల్లెట్లు లభించినట్టు సమాచారం. ఈ ప్రాంతంలో వేటగాళ్లు ఇతర జంతువులను వేటాడిన తర్వాత ఆవుపై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు.

దసరా సెలవులకు హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ అటవీ ప్రాంతానికి చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు వన్యప్రాణుల వేటకు వెళ్లినట్టు సమాచారం. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వందలాది ఫామ్‌ హౌజ్‌లు ఉన్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఈ ఫామ్‌ హౌజ్‌లలో ఎంజాయ్‌మెంట్‌కు వస్తుంటారు. ఆ తర్వాత ఫామ్‌ హౌజ్‌ నుంచి వేటకు వెళ్తుంటారు. ఒక్క దసరానే కాకుండా వీకెండ్‌లో ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆవుపై కాల్పులు జరిపిన వారు కూడా వన్య ప్రాణుల వేటకు వచ్చిన వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇలాంటి వారి హడావిడి కారణంగా తమ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆవులు, గేదెలు, గొర్రెలను మేతకు అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు తుపాకీ గురితప్పితే తమ ప్రాణాలకే ఎసరొస్తుందని భయపడుతున్నారు.

రేపటి రోజున ఎవరైనా జనాలకే తుపాకీ గురిపెడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి.. ఇప్పటికైనా ఫామ్‌హౌజ్‌లు.. అటవీ ప్రాంతాల్లో తిరిగే వారిపై పోలీసులు, అటవీ అధికారులు నిఘా పెడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news