ముందు నుండీ భావిష్టున్నట్టే గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వెంటనే డిసెంబర్ నాలుగున కౌంటింగ్ జరగనుంది. ఇక రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 1న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి జీహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్నాయి.
150 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ లో మొత్తం 744286 వోటర్లు ఉండగా అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది ఉన్నారు. మహిళలలు 35 లక్షల 46 వేల 847 మంది ఉన్నారు. ఇతరులు 669 మంది ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల పోరుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. దుబ్బాకలో దెబ్బ తిన్న అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలిచి తీరాలని ఆదేశించింది. ఇక మరో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డటానికి సిద్ధమయింది. దుబ్బాకలో విజయంతో ఊపుమీదున్న బీజేపీ బల్దియా పీఠంపైనా కాషాయ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?