దేశంలోని బ్యాంకులు అందిస్తున్న విధంగానే ప్రస్తుతం పోస్టాఫీసులు కూడా మనకు సేవింగ్స్ అకౌంట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. బ్యాంకుల్లో ఓపెన్ చేసినట్లుగానే పోస్టాఫీసుల్లోనూ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అయితే బ్యాంకుల కన్నా పోస్టాఫీసుల్లో అకౌంట్లకే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ఇక ఏటీఎం కార్డులను కూడా ఇస్తారు.
పోస్టాఫీఫ్ సేవింగ్స్ అకౌంట్‌కు ఇచ్చే ఏటీఎం కార్డుతో రోజుకు రూ.25వేల వరకు నగదు విత్ డ్రా చేయవచ్చు. ఒకసారికి అయితే రూ.10వేల వరకు గరిష్టంగా నగదు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఇక పోస్టాఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేసేవారు కనీసం అందులో రూ.500 మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫైన్ విధిస్తారు. సాధారణంగా పోస్టాఫీసుల్లో రూ.500 కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.100 చార్జిని వసూలు చేస్తారు.
అయితే ప్రభుత్వ బ్యాంకుల్లో కనీస నగదు మెయింటెయిన్ చేయకపోయినా ఫైన్ వేస్తారు. కానీ ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఈ ఫైన్ భారీగా ఉంటుంది. ఇక ఒక ఏడాదంతా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంటే ఆ అకౌంట్‌ను క్లోజ్ చేస్తారు. కానీ పోస్టాఫీస్‌కు వెళితే మళ్లీ అకౌంట్‌ను ఫైన్ చెల్లించి యాక్టివేట్ చేయించుకోవచ్చు. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ను పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో పొందవచ్చు. అంటే ఎల్పీజీ సబ్సిడీ వచ్చే వారు పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ తెరిచే సమయంలోనే ఆధార్ సీడింగ్ చేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌కు ఓకే అని టిక్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయి సీడింగ్ అయ్యాక సదరు నగదు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఇలా ఆ సదుపాయం పొందవచ్చు.
అలాగే పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే అందులో అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర, మంత్లీ ఇన్కమ్ స్కీం అకౌంట్ (ఎంఐఎస్), సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్) వంటి స్కీంలలో నగదును సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఆయా స్కీంలలో పెట్టుబడి పెట్టిన నగదు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక ఈ అకౌంట్‌కు ఇతర బ్యాంకుల మాదిరిగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే ఇందుకు ప్రత్యేకంగా ఫాం నింపి ఇస్తే చాలు. అకౌంట్ యాక్టివేట్ అయ్యాక వెంటనే నెట్ బ్యాంకింగ్‌ను కూడా యాక్టివేట్ చేసి ఉపయోగించుకోవచ్చు.