కామారెడ్డిలో ఒక పోస్ట్ మ్యాన్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా రెండేళ్ళ నుండి సరిగా డ్యూటీ చేయని ఒక పోస్ట్ మ్యాన్ ఏకంగా ఏడు వేల ఉత్తరాలు దాచినట్టు అధికారుల తనిఖీలలో తేలింది. చివరకు ఉన్నతాధికారులకు ధృవీకరణ కావడంతో అతనిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన బాలకృష్ణ 2019 జనవరిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీట్ 1 పోస్టుమన్ గా విధుల్లో చేరాడు.
అయితే విధుల్లో చేరాడు కానీ అప్పటి నుంచి ఉత్తరాలు మొదలు ఎలాంటి కార్డులు కూడా జనానికి చేరవేయకుండా పట్టణంలోని తన బంధువులకు చెందిన ఒక హోటల్లో దాచిపెట్టాడు. ఉత్తరాలు బట్వాడా కావడం లేదంటూ అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో శనివారం నాడు సదర్ హోటల్ కి వెళ్లి తనిఖీ చేయగా 12 సంచుల్లో 7,000 వరకు ఉత్తరాలు బయటపడ్డాయి. వాటిలో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, వివిధ పుస్తకాలు, బ్యాంకు స్టేట్మెంట్లు సహా ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయి. అయితే అతను ఎందుకు అలా చేశాడు అనేది ఆసక్తికరంగా మారింది.