ఈ మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో భూ కంపాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ తెల్లవారు జామున మరో సారి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలోని నంగలోయి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున 5.02 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఢిల్లీలోని నంగలోయితో పాటు ఎన్సీఆర్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.3గా నమోదైందని జాతీయ సీస్మాలజీ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ భూప్రకంపనలతో తెల్లవారుజామున ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.