ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది రోజుల నుంచి టెన్షన్ టెన్షన్..! ఆ ఉత్కంఠ కాస్తా రేపు పీక్‌కి చేరబోతోందా? తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు తెర లేస్తుందా? JC బ్రదర్స్ దీక్షకు దిగుతున్న వేళ ఇలాంటి సందేహాలే తెరమీదికి వస్తున్నాయ్. ఇటు పోలీసులు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదని చెబుతున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత పది రోజులుగా జరుగుతున్న వార్ ఫైనల్‌కు చేరుకుంది. ఈనెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి… జేసీ ఇంటికి వెళ్లడంతో మొదలైన గొడవ చాలా మలుపులు తిరిగింది. చివరకు JC బ్రదర్స్ ఆమరణ దీక్ష వరకు వెళ్తోంది. పోలీసులు గత కొన్నిరోజులుగా నమోదు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోరాటానికి సిద్ధమయ్యారు. . ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది ప్రభాకర్‌రెడ్డి ఆరోపణ? అయితే తమ్ముడు చేస్తున్న ఆమరణ దీక్షకు అన్నదివాకర్ రెడ్డి కూడా మద్దతు పలికారు. కేవలం మద్దతు మాత్రమే కాదు.. తాను కూడా ఆమరణ దీక్ష చేస్తానని.. 70ఏళ్ల పైబడ్డ వారు వచ్చి దీక్షల్లో కూర్చోండని పిలుపునిచ్చారు.
మరోవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగం చేస్తున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల్ని అనుమతి కోరినా ఇవ్వరని… కేవలం తాను , అన్న దివాకర్ రెడ్డి నల్లబట్టలతో మౌనంగా వెళ్లి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఇటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి జేసీ బ్రదర్స్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. లోకల్ బాడీ ఎన్నికల కోసం సాగుతున్న పొలిటికల్ డ్రామా అంటూ సెటైర్లు వేశారు.
ఇటు జెసి సోదరుల దీక్షతో తాడిపత్రిలో భారీగా పోలీసుల్ని మోహరించి కవాతు నిర్వహించారు. వారు వెళ్తుండగా ప్రభాకర్‌రెడ్డి రోడ్డు పక్కన కూర్చుని అందరికీ దండాలు పెట్టారు. ఇటు నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష పిలుపుతో ఏం జరగబోతుందోన్న టెన్షన్ కనిపిస్తోంది. తాడిపత్రి ఖాకీ వలయంలో ఉంది.