విశాఖజిల్లా రాజకీయాలు అంతా ఓ ఎత్తైతే.. తూర్పు నియోజకవర్గం పాలిటిక్స్ మరో ఎత్తు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా గెలుస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. వరస విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు.అలాంటి శాసనసభ్యుడికి ఇప్పుడో మహిళా నాయకురాలు టెన్షన్ పట్టుకుంది. ఆమె పేరు చెబితేనే బీపీ పెరిగిపోతోంది. ఇదే ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు వెలగపూడి రామకృష్ణబాబు.
స్ధానికేతరుడని రాజకీయ విమర్శలు ఎదుర్కోనే వెలగపూడిని ఓడించడానికి ప్రజారాజ్యం, వైసీపీలు విఫలయత్నం చేశాయి. వరసగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన ప్రస్తుత నగరపార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణను పక్కన బెట్టింది వైసీపీ. 2019 ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన అక్కరమాని కుటుంబాన్ని రంగంలోకి దించింది. భీమిలి ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ వైసీపీ అభ్యర్ధి విజయనిర్మల.. వెలగపూడికి గట్టి పోటీ ఇచ్చారు. వివిధ ఈక్వేషన్ల మధ్య విజయనిర్మల ఓటమి చెందినా.. ఆమెను తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా కొనసాగిస్తోంది వైసీపీ.
ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అక్కరమాని, వెలగపూడి మధ్య రాజకీయ శత్రుత్వం ఓ రేంజ్‌కు పెరిగిపోయింది. పార్టీలతో సంబంధం లేకుండా పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. ఈ పరిణామాలు ఎమ్మెల్యే వెలగపూడికి ఇబ్బందిగా మారుతున్నాయట. అధికారిక కార్యక్రమాల దగ్గర నుంచి అన్నింటా విజయనిర్మలదే ఆధిపత్యంగా మారింది. వైసీపీ కేడర్లో ఉత్సాహం నింపడం.. టీడీపీ శ్రేణులను ఢీ అంటే ఢీ అనడంలో దూకుడుగా వెళ్తున్నారట. దీంతో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నిరసనకు దిగితే ఉత్కంఠ పెరిగిపోతోంది.
ఏడాది కాలం అధికారపార్టీ వ్యూహాలను అంచనా వేయడం కోసం కేటాయించిన వెలగపూడి.. కొద్దిరోజులుగా నియోజకవర్గం స్థాయిని దాటి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ పెద్దలపై నిందలు వేయడం ద్వారా మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే. ఈ ఎత్తుగడల తర్వాత వెలగపూడికి రాజకీయంగా గడ్డుపరిస్థితులు కనిపిస్తున్నాయట. 3 రాజధానులతో మొదలైన సెగ.. బినామీ ఆస్తుల వ్యవహారంతో మరింత ముదిరి పాకానపడింది. ఇప్పటి వరకు అధికార, విపక్షంలో ఏ ఎమ్మెల్యే ఎదుర్కోని విపత్కర పరిస్థితులు ఆయనకు కనిపిస్తున్నాయి.
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత మనసులో మాట ఎలా ఉన్నా వెలగపూడి బయటపడేవారు కాదు. ఈ వ్యవహారంపై తన అభిప్రాయం చెప్పేందుకు సైతం ఆయన అంగీకరించేవారు కాదు. కానీ.. పార్టీ హైకమాండ్ అమరావతిని గట్టిగా సమర్ధించడంతో వెలగపూడి వాయిస్ పెరిగింది. దీంతో అక్కరమాని వర్గం అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేపై ఎదురుదాడి చేస్తోంది. నియోజకవర్గంలో వెలగపూడి హవాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. అందుకే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిరసన పేరు చెబితేనే ఉత్కంఠ తప్పడం లేదు. పోలీసులకు ఇరు వర్గాలను నియంత్రించడం కష్టంగా మారుతోంది.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించి ఏడాదైన సందర్భంగా విశాఖలో అధికారపార్టీ ర్యాలీలు చేసింది. జిల్లా అంతటా ప్రశాంతంగా కార్యక్రమాలు జరిగితే తూర్పులో మాత్రం అలజడి నెలకొంది. ఎమ్మెల్యే ఆఫీస్‌ను ముట్టడించేందుకు విజయనిర్మల వర్గం ప్రయత్నించడంతో వాతావరణం వేడెక్కింది. అలాగే బినామీ ఆస్తులపై ఎమ్మెల్యే విసిరిన సవాల్‌ను ముందుగా స్వీకరించింది విజయనిర్మల వర్గమే. ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే షిరిడీసాయిబాబా ఆలయానికి రావాలని అక్కరమాని చేసిన సవాల్ కలకలం రేపింది. వెలగపూడి రాకపోవడంతో వైసీపీ కేడర్ ఎమ్మెల్యే కార్యాలయం వైపు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వెలగపూడి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ టెన్షన్ తప్పడం లేదని సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ మహిళా నేత మాత్రం వెలగపుడిని తెగ టెన్షన్ పెడుతుందట…