సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలు, సందేశాలను ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా ఇంకో వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇకపై బంగారం కొనాలంటే వినియోగదారులు తమ ఆధార్, పాన్ కార్డులను చూపించాల్సి ఉంటుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతోంది. అయితే ఇందులో నిజమెంత ? అంటే..
బంగారం కొనేందుకు పాన్, ఆధార్ కార్డులు అవసరం లేదు. రూ.10 లక్షలకు మించిన ట్రాన్సాక్షన్ అయితేనే ఆయా కార్డులను చూపించాల్సి ఉంటుంది. అయితే రూ.2 లక్షలకు లోపు ఉన్న బంగారం కొనుగోళ్లకు అయినా సరే ఆధార్, పాన్ కార్డులను షాపుల యజమానులకు చూపించాల్సి ఉంటుందని ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇది ఎంత మాత్రం నిజం కాదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఈ విషయంపై తాజాగా స్పష్టతనిచ్చారు.
సాధారణంగా బ్యాంకింగ్ లావాదేవీలు అయితే రూ.2 లక్షలకు మించి నగదును అనుమతించరు. ఆన్‌లైన్‌లో లేదా చెక్కు ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దీన్ని బంగారం కొనుగోళ్లకు ఆపాదించారు. కానీ నిజానికి ఈ నిబంధనకు, బంగారం కొనుగోళ్లకు సంబంధం లేదు. రూ.2 లక్షలకు మించిన నగదుతో బంగారం కొనుగోలు చేయవచ్చు. దానికి ముందు తెలిపిన రూ.2 లక్షల పరిమితి వర్తించదు. ఇక రూ.10 లక్షల కన్నా పైన విలువ గల బంగారాన్ని కొంటేనే ఆధార్, పాన్ కార్డులను చూపించాల్సి ఉంటుంది. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మకూడదని అధికారులు హెచ్చరించారు.