కంచుకోటలో టీడీపీ చేతులెత్తిసిందా

-

ఆ నియోజకవర్గం టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ముంగిట పూర్తిగా చేతులు ఎత్తేసింది. క‌నీసం స‌గం డివిజ‌న్లలో కూడా పోటీ చేయ‌లేని ద‌య‌నీయ స్థితిలోకి టీడీపీ కూరుకుపోవడంపై పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీకి సెంటిమెంట్ గా మారిన నియోజకవర్గంలో ఎందుకీ పరిస్థితి అంటూ నిట్టురుస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఎన్టీఆర్‌. అప్పటి నుంచి టీడీపీకి ఈ ప్రాంతం సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో ఉన్న నియోజకవర్గం. ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే పార్టీకి బలమైన కేడర్‌ ఇక్కడ ఉంది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మిగలిన చోట్ల టీడీపీ ఓటమి ఒక ఎత్తు అయితే.. తిరుపతిలో అపజయం మరోఎత్తు. కేవలం 800 ఓట్ల తేడాతోనే టీడీపీ ఓడిపోయింది. అలాంటి ప్రాంతంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతుంటే చేతులు ఎత్తేశారు పార్టీ నాయకులు.

సులువుగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేష‌న్ పీఠం వైసీపీ వశమయ్యే పరిస్థితి ఉంది. మొత్తం 50 డివిజ‌న్లలో కేవ‌లం 22చోట్ల మాత్రమే టీడీపీ అతికష్టం మీద తమ అభ్యర్థులనో నామినేషన్లు వేయించింది. 21 డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవమే అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. అభ్యర్థులు బరిలో లేకపోవడానికి టీడీపీలో ఇప్పుడు రకరకాలుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్‌ వైఖరి వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని పార్టీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో వారు సైలెంట్‌ కావడాన్ని ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీతో టీడీపీలోని కొందరు కుమ్మక్కయ్యారని.. అందువల్లే నామినేషన్లు వేయలేదన్నది ఇంకొందరు చేసే ఆరోపణ. దీంతో తిరుపతిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. టీడీపీ శ్రేణులపై దాడులు జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఎక్కడా కనిపించలేదని.. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం లేదని చెబుతున్నారు.

తిరుపతిలోని టీడీపీ కేడర్‌ను ఎవరిని కదిపినా ఒకటే సమాధానం వస్తోందట. తమ నాయకులు కొందరు వైసీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని కోడై కూస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధిష్ఠానం స్థానిక నేతలపై సీరియస్‌ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news