శివరాత్రి.. భోళాశంకరుడి అనుగ్రహం పొందేందుకు చేసే పండుగల్లో అతి ముఖ్యమైనది. శివరాత్రి వచ్చిందంటే చాలు శైవక్షేత్రాలు కళకళలాడుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శైవక్షేత్రాలు ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసుడిని వధించినప్పుడు ఆ రాక్షసుడి గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలై ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ప్రాంతాల్లో పడిందని ప్రచారం. ఆ ఐదు శివక్షేత్రాలనే పంచారామాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివరాత్రి సందర్భంగా ఈ పంచారామ శివక్షేత్రాల విశిష్టతను తెలుసుకుందాం రండి.
ద్రాక్షారామం పుణ్యక్షేత్రం
ద్రాక్షారామం ఆలయం ఎంతో ప్రసిద్ధి. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రాంతం ఇది. తారకాసుడిని వధించినప్పుడు అతడి గొంతులో ఉన్న శివలింగంలోని ఓ భాగం ద్రాక్షారామంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని క్రీ.శ. 892-922 కాలంలో తూర్పు చాళుక్యులు నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనాలు ద్వారా తెలుస్తోంది. ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, మాణిక్యాంబ అమ్మవారు, లక్ష్మీనారాయణుడు, విష్ణాలయం వంటి శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలోని శివుడు లింగంభీమేశ్వర లింగంగా ఎంతో ప్రసిద్ధి. 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఈ లింగం ఉంటుంది.
అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం
అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కృష్ణానది తీరాన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలతో ఈ ఆలయం కూడా ప్రత్యేకమే. పురాణాల్లో ఈ ఆలయాన్ని క్రౌంచతీర్థంగా పరిగణించారు. ఈ క్షేత్రంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి.. అమరేశ్వరుడనే నామకరణం చేశాడని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి.
సోమారామం పుణ్యక్షేత్రం
సోమారామం శైవక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని గునిపూడిలో ఉంది. ఇక్కడి శివుడు సోమేశ్వర జనార్ధనుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజు చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఉన్న శివలింగ సాధారణ రోజుల్లో నలుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తే.. అమావాస్య రోజు గోధుమ వర్ణంలో దర్శనమిస్తాడు.
కుమారారామం పుణ్యక్షేత్రం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో కుమారారామం పుణ్యక్షేత్రం ఉంది. ఇందులో ఉండే స్వామి వారు భీమేశ్వరుడు. పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడి శివలింగం తెలుపు రంగులో ఉంటుంది. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.
క్షీరారామం పుణ్యక్షేత్రం
పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడిగా వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం క్షీరారామం. శ్రీ మహావిష్ణువే ఇక్కడ శివలింగానికి ప్రతిష్టించి క్షేత్రపాలకుడిగా కొనసాగుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివలింగం కూడా తెలుపు రంగులో ఉంటుంది. ప్రతి ఏడాది ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలోని కిరణాలు ఆలయ పెద్ద గోపురం నుంచి స్వామి వారిపై పడుతాయి.