తెలంగాణలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విషయానికి వస్తే మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడంతో… ఆ ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. వెంటనే నాలుగో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు.. ఇప్పటి వరకు మొత్తం మూడు రౌండ్ లు కలిపి 1,68,032 ఓట్లు లెక్కించినట్లు వెల్లడించారు అధికారులు.. ఇందులో 1,57,950 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవికి 53,007 ఓట్లు అంటే 33.5 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 48,563 ఓట్లు 30.7 శాతం రాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ 25,505 అంటే 16.1 శాతం ఓట్లు సాధించారు. ఇక నల్గొండ – ఖమ్మం – వరంగల్ స్థానానికి వస్తే ఇక్కడ కూడా నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 4వ రౌండ్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,897 ఓట్లు పోలవ్వగా సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 12,146, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 10,048 ఓట్లు వచ్చాయి. ఇక, మిగతా అభ్యర్థులు ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 5,099, రాములు నాయక్(కాంగ్రెస్)కు 4,003 ఓట్లు పోలయ్యాయి.