కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బిఎస్ యెడియరప్ప నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తాజా ఆంక్షలను ప్రకటించిన ఒక రోజు తరువాత, కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణులు మరియు సాంకేతిక నిపుణులతో కూడిన సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) సలహా మేరకు ఈ మార్గదర్శకాలను ప్రవేశ పెట్టామని అన్నారు. ఇది తొందర పాటు నిర్ణయం కాదని కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం అనివార్యం అని, లేకపోతే కరోనా అదుపులోకి రాదని అన్నారు.
ఏప్రిల్ 20 నాటికి అదుపులోకి వస్తే అన్నికార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి ప్రజలను అనుమతిస్తామని అన్నారు. ఇదిలావుండగా, బిఎస్ యెడియరప్ప ప్రభుత్వం నిన్న కొత్త మార్గదర్శకాల ప్రకారం జిమ్‌లు, ఈత కొలనులను మూసివేయాలని ఆదేశించింది. అలానే కొన్ని జిల్లాల్లో థియేటర్లలో 50 శాతం సీటింగ్ ఉంచాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాల ద్వారా ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఏప్రిల్ 20 వరకు అమల్లో ఉంటాయి. అయితే చివరి దశ లాక్ డౌన్ లో ఇలాంటి ఆంక్షలు ఉండేవి, కానీ ఇప్పుడు లాక్ డౌన్ అనే పేరు లేకుండా ఆంక్షల పేరుతో పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు.