దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో సార్స్ సీవొవీ2 కరోనా వైరస్ కు చెందిన అన్ని రకాల వేరియంట్లను సమూలంగా రూపుమాపుతుందని ఐసీఎంఆర్ తెలింది. కరోనాకు చెందిన డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా కోవాగ్జిన్ నాశనం చేస్తుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
సార్స్ సీవోవీ2కు చెందిన అన్ని వేరియంట్లను ప్రత్యేకంగా కల్చర్ చేసి వాటిని అధ్యయనం చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ అధ్యయనం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ను అందిస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే తర్వలో అంటే మే 1 నుండి 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలు వేయనున్నారు.