ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ టెర్రర్ సృష్టిస్తోంది. వైరస్‌ను కంట్రోల్ చేయడానికి ఆయా దేశాలు ఎంతో ప్రయత్నించినా.. విఫలమవుతున్నారు. అయితే వైరస్ వ్యాధి ఎందుకింత వేగంగా వ్యాప్తి జరుగుతుందనే విషయంపై పరిశోధకులు రిసెర్చ్ చేశారు. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జేఏఎంఏ)లో ప్రచురించిన ఒక అధ్యాయనం ప్రకారం.. పెద్దల కంటే పిల్లల వల్లే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. పెద్దల కంటే పిల్లల్లోనే వైరస్ ఎక్కువగా ఉంటుందన్నారు. వీరి వల్ల వేరే వాళ్లకు వైరస్ సులభంగా వ్యాప్తి జరుగుతోందన్నారు.
పెద్దల కంటే పిల్లలు, యువకులు కరోనా వైరస్‌ను వేగంగా వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు తెలిపారు. పిల్లలు వైరస్‌కు వాహకంగా పనిచేస్తున్నారని తేల్చి చెప్పారు. ఈ అధ్యాయనంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలపై జేఏఎంఏ పరిశోధన నిర్వహించింది. కరోనాతో తేలికపాటి, ఎక్కువ లక్షణాలు బాధపడుతున్న పిల్లల వల్ల వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా జరుగుతుందన్నారు. పెద్దవాళ్ల కంటే చిన్న పిల్లల ముక్కు, గొంతులో 10 నుంచి 100 రెట్లు ఎక్కువ వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు.
జేఏఎంఏ తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ బారి నుంచి పిల్లలను మనమే కాపాడాలన్నారు. వీరి వల్ల వైరస్ సంక్రమణ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ వైరస్ వీరితోపాటు పక్కవాళ్లకు సోకే ప్రమాదం ఉందన్నారు. వీలైనంత వరకు పిల్లలకు వ్యాక్సిన్ అందజేయాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పెద్దవాళ్ల ఇస్తున్న టీకా డోసు కంటే.. చిన్న పిల్లలకు డోసు తగ్గించి టీకా ఇస్తే సరిపోతుందన్నారు. అప్పుడే కరోనా నియంత్రణలోకి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీదారులు పిల్లల కోసం వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని, వీరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉందన్నారు.