హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల ఇలాకలో ఫ్లెక్సీ కలకలం రేపింది. మాజీ మంత్రి ఈటలకు టీఆర్ఎస్ నేతలు ఝలక్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల ఫొటో లేకుండా టీఆర్ఎస్ ప్లెక్సీ రాత్రి రాత్రికి వెలిసింది. ఈ ఫ్లెక్సీలో మంత్రి గంగుల కమలాకర్ సహా మిగిలిన వాళ్ల ఫొటోలు ఉన్నాయి. కానీ అందులో ఈటల ఫోటో మాత్రం లేదు. దీంతో ఈ ఫ్లెక్సీపై నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఉండటంపై టీఆర్ఎస్‌లోని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గంగుల పుట్టిన రోజు కాబట్టే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని మరికొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు.
అచ్చంపేట అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈటలను టీఆర్ఎస్ నేతలు ఇంకా వదిలిపెట్టడంలేదు. ఈ ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు ట్విస్టులు మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఈటలకున్న మంత్రి పదవిపై వేటు వేశారు. అంతటి ఆగకుండా పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని పట్టు బడుతున్నారు. ఈ లోపే ఈటల నియోజకవర్గం హుజూరాబాద్‌లో పట్టుకోసం ప్రయత్నాలు మమ్మురంగా చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని బృందం.. హుజురాబాద్ నియోజకవర్గం తమదేనని సంకేతాలు పంపుతున్నారు. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉంటూ ఈటల శ్రేణులు, అభిమానులనుపై దృష్టి పెట్టారు. టీఆర్ఎస్‌తో ఉండాలని లేదంటే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.