దేశంలో సెకండ్ వేవ్ వీర విహారం చేస్తున్న ప్రస్తుతం సమయంలో వ్యాక్సిన్ ఆవశ్యకత ఎంతో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకి 3లక్షలకి పైగా కేసులు వస్తుండడమే కాదు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ కొరత ఉంది. ఐతే ఇవన్నీ ఇలా జరుగుతుండగానే ప్రఖ్యాత సీరం ఇన్స్టిట్యూట్ యూకేకి వ్యాక్సిన్ పంపించడానికి సిద్ధమైంది. 50లక్షల డోసులను యూకేకి ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న సీరం, అనుమతి కోసం భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
వ్యాక్సిన్ల కొరత, ఆక్సిజన్ అందకపోవడం, బెడ్లు లేకపోవడం మొదలగు కారణాల వల్ల ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం, యూకేకి పంపించే 50లక్షల డోసులని బ్లాక్ చేసింది. వ్యాక్సిన్ ఎంతగానో అవసరం ఉన్న దేశ ప్రజల తర్వాతే ఇతరులకి ఎగుమతి చేయాలని సూచించింది. ఎలక్షన్ ర్యాలీలు, కుంభమేళాలు, సెకండ్ వేవ్ వస్తుందన్నా కూడా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఈ విధమైన పరిస్థితి తలెత్తిందని అటు ప్రతిపక్షాల నుండి ఇటు పౌరులు విమర్శలు చేస్తున్నారు.