కరోనా నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) దేశవ్యాప్తంగా సీరో పాజిటీవిటీ సర్వేను చేపట్టింది. అయితే ఈ సర్వే ద్వారా పలు కీలక విషయాలను సీఎస్ఐఆర్ వెల్లడించింది. ఏబీ, బి బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారికి కోవిడ్ రిస్క్ ఎక్కువేనని, ఓ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నవారికి కోవిడ్ రిస్క్ తక్కువని సర్వేలో వెల్లడైంది.
ఏబీ, బి బ్లడ్ గ్రూప్‌లు కలిగి ఉన్నవారే ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారని సీఎస్ఐఆర్ సర్వే ద్వారా వెల్లడైంది. ఇక ఓ గ్రూప్ రక్తం కలిగి ఉన్నవారు కోవిడ్ బారిన పడినప్పటికీ వారిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని, కొందరికి అసలు లక్షణాలే ఉండడం లేదని, వారు కోవిడ్ వల్ల చనిపోయే అవకాశాలు కూడా తక్కువగా ఉంటున్నాయని తేల్చారు.
అయితే ఓ గ్రూప్ బ్లడ్ కలిగి ఉన్నవారికి కోవిడ్ రిస్క్ తక్కువే అయినప్పటికీ వారు జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్రూప్ రక్తం ఉంది కదా.. ఏముందిలే.. అని అనుకోకూడదని, ఇది కేవలం సర్వే మాత్రమేనని, నిజానికి కోవిడ్ నుంచి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా దేశంలో 10వేల మంది నుంచి సేకరించిన శాంపిల్స్‌ను 140 మందికి పైగా డాక్టర్లు విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించారు. ఇక మాంసం తినే వారికి కోవిడ్ ముప్పు ఎక్కువేనని, శాకాహారులకు కోవిడ్ రిస్క్ తక్కువగా ఉంటుందని తేల్చారు.
శాకాహారంలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శాకాహారంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని, కనుక కోవిడ్ బారిన పడ్డా శాకాహారులు త్వరగా కోలుకుంటారని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేల్చారు. అయితే తక్కువ స్థాయిలో ఈ సర్వేను చేశారు కానీ దీన్ని ఇంకా ఎక్కువ మందితో చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని నిపుణులు తెలిపారు.