తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. ఈటల రాజేందర్ వ్యవహారం బయటకు వచ్చిన రోజే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు అదృశ్యం కావడం.. ఆ వెంటనే అరెస్టు కావడం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అయితే వామన్‌రావు దంపతుల హత్యకేసులో పుట్టమధు దాదాపు సేఫ్‌జోన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే మూడురోజులు విచారణ జరిపిన పోలీసులు నిన్న నాలుగోరోజు కూడా అనూహ్యంగా కస్టడీలో విచారించారు. అయితే ఈ విచారణలో తనకు లాయర్ దంపతుల హత్యకు ఎలాంటి సంబంధం లేదని పుట్టమధు తెలిపినట్టు తెలుస్తోంది.
హత్య జరిగేవరకు తనకు ఏ విషయం తెలియదని, తాను ఎవరికీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయలేదని ఈ విషయంలో ఎన్నిసార్లు అయినా విచారణకు వచ్చి నిరూపించుకుంటానని తెలిపాడని సమాచారం. అయితే ఈ కేసులో పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు మధుపై కేసు పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. మరోసారి విచారణ మాత్రమే జరపాలని భావిస్తున్నారు. ఆయన భార్యపై కూడా కేసు పెట్టకుండా కేవలం విచారణ మాత్రమే జరపనున్నారు. ఇదిలా ఉండగా పుట్టమధు ఇంటికి రావడంతో పెద్ద ఎత్తున నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మరి రాజకీయాలు ఇంకెత మలుపు తిరుగుతాయో చూడాలి.