కరోనా వల్ల 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలు దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున నష్టాలను చవిచూశాయి. అయితే ఆ నష్టాల నుంచి కోలుకునేందుకు ఇప్పుడు అనేక రంగాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో బెవరేజ్ ఇండస్ట్రీపై కరోనా దెబ్బ బాగానే పడింది. దీంతో అక్కడి పౌరులను మద్యం సేవించాలని, తమను ఆదుకోవాలని బెవరేజ్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.
కోవిడ్ వల్ల బ్రిటన్‌లో సుమారుగా 40వేల పబ్‌లు, బార్లపై ప్రభావం పడింది. అనేక పబ్‌లు, బార్లను ఇప్పటికే మూసేశారు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న పబ్‌లు, బార్లు మనుగడలో ఉండాలంటే ఒక్కో బ్రిటన్ పౌరుడు రానున్న రోజుల్లో సుమారుగా 60 లీటర్ల బీర్‌ను తాగాలని లేదా 40 రోస్ట్ డిన్నర్‌లు చేయాలని, 976 క్రిస్ప్ ప్యాక్‌లను తినాలని లేదా 122 గ్లాసుల వైన్ తాగాలని అక్కడి బెవరేజ్ ఇండస్ట్రీ సూచించింది. కరోనా వల్ల దెబ్బ తిన్న పబ్‌లు, బార్లు మూతపడకుండా మనుగడలో ఉండాలంటే ఈ ఏడాదిలో సగటు బ్రిటన్ పౌరుడు పబ్‌లు, బార్లలో ఖర్చు చేసే సరాసరి మొత్తం కన్నా మరో 382 పౌండ్లను అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అభిప్రాయ పడింది.
ఈ క్రమంలోనే బ్రిటన్‌లోని బెవరేజ్ ఇండస్ట్రీ అక్కడి పౌరులను మద్యం సేవించాలని ప్రోత్సహిస్తోంది. మీ దగ్గర్లో ఉన్న పబ్ లేదా బార్‌ను ఆదుకోవాలంటే మీరు మద్యం తాగాలి అని విజ్ఞప్తి చేస్తోంది. మరి బ్రిటన్ పౌరులు ఏం చేస్తారో చూడాలి. కాగా కరోనా ప్రభావం తీవ్రంగా పడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. కానీ ఇప్పుడక్కడ కోవిడ్ ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ కోవిడ్ వల్ల నష్టపోయిన రంగాలు తిరిగి కోలుకోవాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని నిపుణులు అంటున్నారు.